ఎఫ్​టీఎల్​లో నిర్మాణాలకు ఎలా పర్మిషన్లు ఇచ్చారు?

  • బ్యాంకులు చెక్​ చేయకుండానే లోన్లు ఇచ్చాయా ?
  • అన్ని పర్మిషన్లు ఉన్నాయనే రూ.కోట్లు పెట్టి విల్లాలు కొన్నాం 
  • తమకు న్యాయం చేయాలని హైడ్రా చీఫ్​ను  కోరిన కత్వా చెరువు విల్లాల బాధితులు

హైదరాబాద్, వెలుగు: చెరువు ఎఫ్​టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలకు ఆఫీసర్లు ఎలా పర్మిషన్లు ఇచ్చారని కత్వా చెరువు విల్లాల బాధితులు ప్రశ్నించారు. మేడ్చల్​మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ లోని మల్లంపేట్ కత్వా చెరువు ఎఫ్​టీఎల్, బఫర్​జోన్​లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాలను హైడ్రా  కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు విల్లాల ఓనర్లు సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిశారు.  

అనంతరం భావనాస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. విల్లాలను కూల్చివేయడంతో తాము తీవ్రంగా నష్టపోయామని, అన్ని అనుమ తులు ఉన్నాయనే వీటిని కొనుగోలు చేశామన్నారు. ఎఫ్​టీఎల్​లో నిర్మాణాలకు అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారని, రిజిస్ట్రేషన్లు ఎలా చేశారన్నారు. బ్యాంకులు లోన్లు ఎందుకు ఇచ్చాయని ప్రశ్నించారు. 

రూ.కోటి నుంచి 2 కోట్ల వరకు పెట్టి విల్లాలు కొనుగోలు చేశామని, బిల్డర్ తో మాట్లాడి తమ డబ్బులు తమకు వాపాసు ఇప్పించాలని లేదా వేరే ప్రాంతాల్లో ఇండ్లు ఇప్పిం చాలని కోరారు. అయితే, ఈ విషయంపై తాను ఏం చేయలేనని, స్థానిక పోలీసులను ఆశ్రయించి బిల్డర్లపై కేసులు పెట్టాలని రంగనాథ్ బాధితులకు సూచించారు. 

కమిషనర్ ను కలిసిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు  రాంనారాయణరెడ్డి, ముత్యంరెడ్డి, వెంకట్ రమణ, అశోక్, మొహన్ రావు, సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.