ఉప రాష్ట్రపతి, సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు

మెదక్, పాపన్నపేట, కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లాలో బుధవారం ఉప రాష్ట్రపతి జగదీశ్ ధన్ ఖడ్, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సీఎం ముందుగా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయాన్ని సందర్శించి, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వందేళ్ల చరిత్రగల మెదక్ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.  మంగళవారం సీఏంవో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రకాశ్ ఏడుపాయలలో ఏర్పాట్లు పరిశీలించారు. రెండు చోట్ల ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఏడుపాయలలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. 

తునికి కేవీకేలో.. 

కౌడిపల్లి మండలం తునికి శివారులోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఉప రాష్ట్రపతి జగదీశ్ ధన్ ఖడ్ సందర్శించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి బందోబస్తుపై పోలీసులకు సూచనలు చేశారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ మహేందర్, సభా ప్రాంగణాన్ని పరిశీలించి హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. కేవీకే  సమీపంలో మూడు హెలీప్యాడ్ లు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్, కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ, ఆరుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలతో పాటు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫోర్స్ తో బందోబస్తు ఏర్పాటు చేశారు. 

రూ.750 కోట్లు మంజూరు

మెదక్ సెగ్మెంట్ లో వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి రూ.750 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. బుధవారం రూ.473 కోట్ల విలువైన పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఏడుపాయలలో శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ఇందులో మెదక్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, రామాయంపేట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, మెదక్ ఇందిరా మహిళా శక్తి భవనం, ఏడుపాయలలో రూ.35 కోట్లతో చేపట్టే  బీటీ రోడ్డు, డివైడర్, హై మాస్ట్ లైట్ల ఏర్పాటు పనులు, గిరిజన తండాలకు రూ.45.32 కోట్లతో రోడ్ల నిర్మాణం, రూ.7.44 కోట్లతో చేపట్టే ఆర్అండ్ బీ రోడ్ల నిర్మాణం పనులు ఉన్నాయన్నారు.