జనవరి 22న సెలవు ఇవ్వండి : పండగ చేసుకుంటాం

జనవరి 22న సెలవు ఇవ్వండి : పండగ చేసుకుంటాం

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న రామమందిర ప్రాణ ప్రతిష్ట (పవిత్రోత్సవం) జనవరి 22, 2024న జరగనుంది. ఈ సందర్భంగా హిందూ సంస్థ విశ్వహిందూ పరిషత్ (VHP) ఓ కీలక డిమాండ్ చేస్తోంది. ఈ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లకు లేఖ రాసింది.

రామమందిర ప్రాణ ప్రతిష్టకు ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వివిధ రంగాలకు చెందిన వందలాది మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. కాశీ విశ్వనాథ్, వైష్ణో దేవి వంటి ప్రధాన ఆలయాల అధిపతులు, మతపరమైన, రాజ్యాంగ సంస్థల ప్రతినిధులను కూడా ఆహ్వానించినట్లు ట్రస్ట్ తెలిపింది. వీరితో పాటు ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా, కేరళకు చెందిన మాతా అమృతానందమయి, యోగా గురువు బాబా రామ్‌దేవ్, సినీ తారలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ , మాధురీ దీక్షిత్ , అరుణ్ గోవిల్, సినీ దర్శకుడు మధుర్ భండార్కర్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ , అనిల్ అంబానీ, ప్రముఖ చిత్రకారుడు వాసుదేవ్ కామత్,  నీలేష్ దేశాయ్ లాంటి ప్రముఖులను సైతం ఈ వేడుకకు ఆహ్వానించారు.

శంకుస్థాపన కార్యక్రమానికి సన్నాహాలు ప్రారంభించినట్లు అయోధ్య మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఇంతకుమునుపే తెలిపారు. భక్తుల కోసం ఫైబర్ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని, నిర్ణీత ప్రదేశాల్లో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేస్తామని అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో 'రామ్ కథా కుంజ్' కారిడార్ నిర్మితమవుతోందని, ఇది రాముడి జీవితంలోని 108 సంఘటనలను ప్రదర్శించే పట్టికను ప్రదర్శిస్తుందని తెలిపారు.