స్వార్థ ప్రయోజనాల కోసమే వీటో పవర్​ వాడుతున్రు

స్వార్థ ప్రయోజనాల కోసమే వీటో పవర్​ వాడుతున్రు

యునైటెడ్ ​నేషన్స్: ఐక్యరాజ్యసమితిలో వీటో పవర్​ను రాజకీయపరమైన స్వార్థ ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తున్నారని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్​సీ) మీటింగ్​లో ఇండియా మండిపడింది. వీటో పవర్ వినియోగించే విషయంలో నైతిక బాధ్యత ఎక్కడా కనిపించడం లేదని విమర్శించింది. వెంటనే యూఎన్​లో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేసింది. సెక్యూరిటీ కౌన్సిల్​లో 15 దేశాలు ఉన్నాయని, కేవలం ఐదింటికి మాత్రమే వీటో అధికారం ఇవ్వడం అన్ని దేశాల సార్వభౌమ సమానత్వ భావనకు విరుద్ధమని తేల్చి చెప్పింది. బుధవారం ‘‘వీటో వినియోగం” అనే అంశంపై యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ప్లీనరీ సమావేశంలో  ఇండియా పర్మనెంట్ మిషన్ కౌన్సిలర్ ప్రతీక్‌‌ మథూర్‌‌ మాట్లాడారు. 

సెక్యూరిటీ కౌన్సిల్​లో చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకేతో పాటు యూఎస్​కు మాత్రమే వీటో పవర్ ఉందని, రెండేండ్లకు ఓసారి ఎన్నుకునే మిగిలిన 10 నాన్ పర్మనెంట్ దేశాలకు వీటో పవర్ లేకపోవడం సరికాదన్నారు. పోయిన ఏడాది ఏప్రిల్​లో ఉక్రెయిన్​తో యుద్ధ సమయంలో రష్యా ఒక తీర్మానం విషయంలో వీటో పవర్​ను ఉపయోగించుకుందని గుర్తు చేశారు. అప్పుడే యూఎన్ జనరల్ అసెంబ్లీ ‘వీటో ఇనీషియేటివ్’ తీర్మానాన్ని ఆమోదించిందన్నారు. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్​లో అన్ని దేశాలను సమానంగా చూడాలని.. లేదంటే మరిన్ని దేశాలకు వీటో పవర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఎప్పటికీ మావే..

కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఇండియాలో భాగమని, వాటిని ఇండియా నుంచి ఎవరూ విడదీయలేరని ప్రతీక్ మాథుర్ తేల్చిచెప్పారు. యూఎన్​ వేదికగా పాకిస్తాన్ ప్రతినిధి మునీర్ అక్రమ్ జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించడంపై ప్రతీక్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా జమ్మూ కాశ్మీర్, లడఖ్​ను ఇండియా నుంచి విడదీయలేరు. ఎప్పటికీ అవి ఇండియాలో అంతర్భాగాలే. యూఎన్ జనరల్ అసెంబ్లీ ఎజెండాతో సంబంధం లేకుండా పాకిస్తాన్ అక్కర్లేని అంశాలను ప్రస్తావిస్తున్నది”అని ఆయన మండిపడ్డారు.