కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నాడు. అతను ప్రస్తుతం పిహెచ్‌డి డిగ్రీ చదువుతున్నట్లు వెల్లడించాడు. క్రికెట్ ఆడుతూనే విద్యను అభ్యసించాలని తన తోటి దేశస్థులకు సూచించాడు. మధ్యప్రదేశ్‌లో జన్మించిన అతను డాక్టర్ వెంకటేష్ అయ్యర్‌గా తిరిగి వస్తానని ప్రమాణం చేశాడు. వయస్సు పైబడితే క్రికెట్ ఆడలేమని.. అయితే చదువు శాశ్వతంగా ఉంటుందని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
“మనం జీవించి ఉన్నంత వరకు చదువులు మనతోనే ఉంటాయి.. 60 ఏళ్ల వరకు క్రికెట్ ఆడలేం.. క్రికెట్ అంటే కొద్దికాలం మాత్రమే అని మీరు అర్థం చేసుకోవాలి.. ఆ తర్వాత జీవితంలో ఏదైనా చేయాలంటే చదువు తప్పనిసరి. చదువుల కారణంగా కొంతకాలం క్రికెట్‌కు దూరమయ్యాను". అని అయ్యర్ తెలిపాడు.
"చదువు మైదానంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది. క్రికెటర్లు క్రికెట్ పరిజ్ఞానాన్ని మాత్రమే కాకుండా సాధారణ పరిజ్ఞానాన్ని కూడా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు మీ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలగాలి. నేను ప్రస్తుతం పిహెచ్‌డి (ఫైనాన్స్) చదువుతున్నాను". అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.
ALSO READ | ముగ్గురు కొడుకులు.. రెండు దేశాలు: జింబాబ్వే తరపున బెన్ కుర్రాన్ అరంగ్రేటం
ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా యువ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జాక్ పాట్ కొట్టాడు. వెంకటేశ్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.23.75 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసింది. అయ్యర్ గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. 2021లో జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలోనూ.. 2024 సీజన్‌లో ఆ జట్టు ట్రోఫీ ముద్దాడడంలోనూ తనవంతు సహకారం అందించాడు. ఓపెనర్‌గా మంచి భాగస్వామ్యాలు అందించాడు. గడిచిన సీజన్‌లో 4 అర్ధసెంచరీలు బాదాడు. మొత్తంగా 158.80 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 370 పరుగులు సాధించాడు.