ఎములాడ అభివృద్ధిపై ఆశలు!

వేములవాడ ఓ పుణ్యక్షేత్రం.  మా చిన్నప్పుడు  కొన్ని జిల్లాల  ప్రజలకే అది పరిమితం. అయితే,  బాగా ప్రచారం కావడం వల్లే విపరీతంగా భక్తులు పెరిగారు.  దానివల్ల కొంత ఉపయోగం, మరి కొంత నష్టం ఉంది. ఉపయోగం ఏమంటే చాలామందికి పని దొరకడం.  గుళ్లు, గోపురాలు కూడా పరిశ్రమలాంటివే.  ఎంతోమందికి జీవనోపాధిని  కలిగిస్తున్నాయి.  మా వేములవాడ  కూడా  ఎంతోమందికి జీవనోపాధిని కలిగిస్తోంది.  ప్రతి ఊరు అభివృద్ధి చెందినట్లుగానే మా ఊరు అభివృద్ధి చెందింది.  కానీ, ఎంతైతే  అభివృద్ధి చెందాలో  అంతగా అభివృద్ధి చెందడం లేదు.  యాత్రికుల రద్దీ పెరగడం వల్ల రోడ్లన్నీ కిక్కిరిసి పోవడం, నడవడానికి కూడా కష్టం కలగడంలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి.  మొదటిరోజు  రాజేశ్వరుని దర్శనం చేసుకోవడం.  రెండో రోజు పోచమ్మని దర్శనం చేసుకోవడం, పోచమ్మ దగ్గరికి వెళ్లిన తరువాత జాతర గ్రౌండ్​లో  కోళ్లని, గొర్రెలను కోయడం. ఆ వ్యర్థాలు ఊరినిండా పేరుకునిపోవడం జరుగుతున్నది.  కాగా,  కరోనా కాలంలో వేములవాడకి చాలామంది యాత్రికులు రావడం వల్ల చాలా మరణాలు సంభవించాయి. అదొక విషాదం. 


రాజేశ్వరుని  గుడిపక్కన  పెద్ద చెరువు ఉండేది.  అందులోనే  ధర్మగుండం ఉండేది.  దాన్ని చెరువు నుంచి దూరం చేశారు. దానివల్ల ధర్మగుండం నీటిలోని నీటి పరిశుభ్రత తగ్గిపోయింది.  దీంతో అంటువ్యాధులు  ప్రబలాయి. దానికి బాధితులు వేములవాడవాసులే.  రాజేశ్వరుని దగ్గరికి సులువుగా వెళ్లి దర్శనం చేసుకునేవాళ్లు వేములవాడ గ్రామస్థులు.  భక్తుల రద్దీ పెరగడం వల్ల అది కష్టమైపోయింది. ‘మా వేములవాడ కథలు’లో నేనే చెప్పినట్టు ‘అన్నపూజ’ ప్రధానమైన పూజ.  అన్నాన్ని తమ ఇంట్లోనే  వండి రాజేశ్వరుని లింగంమీద పెట్టి పూజలు చేసేవాళ్లు. అది అంతరించిపోయింది.  ఎంతమార్పు.  మా చిన్నతనానికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. మార్పు సహజం. మారిన పరిస్థితుల ప్రకారం మనమూ మారాల్సిందే. అప్పుడు రోజుకి ఒకరిద్దరు అన్నపూజ చేసేవాళ్లు. ఇప్పుడు వందల సంఖ్య దాటుతున్నది. అందుకే ఇట్లా మార్చినారు. దేవస్థానం అధికారులు మాత్రం ఏం చేస్తారు.  ఏం చేయగలరు ఎవరైనా.. మార్పుకు అనుకూలంగా పూజ చేయడం తప్ప. 

వేములవాడకు మంచి రోజులు!

వాహనాలు పెరిగాయి. జనం పెరిగారు.  యాత్రికులు పెరిగారు. రోడ్లు మారి ఇరుకుగా మారిపోయినాయి. గత పది సంవత్సరాలగా వేములవాడ అభివృద్ధి చేస్తామన్న మాటలు చాలా వినిపించాయి. కానీ, అనుకున్న రీతిలో పురోగతి కనిపించలేదు.  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ఆది శ్రీనివాస్​ ఎమ్మెల్యే అయిన తరువాత వేములవాడ ప్రజలకు మంచిరోజులు వస్తున్నాయని అనిపిస్తోంది. వారికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పూర్వ కరీంనగర్​ జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధరబాబు సహకారం కూడా ఉన్నట్లు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి వేములవాడకి వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ అభివృద్ధి పనుల కోసం 127.65 కోట్లు మంజూరు చేసింది. 

ఆలయ కాంప్లెక్స్​ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ. 76 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేశ్వరుని ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల వెడల్పు కోసం రూ. 47.85 కోట్ల నిధులను విడుదల చేసింది.  ఇంతేకాకుండా మూలవాడలో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల  కమాన్​ జంక్షన్​ వరకు డ్రైనేజీ పైపులైన్​ నిర్మాణం కోసం ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవన్నీ జరిగితే వేములవాడ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధాన కారణం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సీఎం రేవంత్​రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం.  వీరందరినీ అభినందిస్తూనే  గత  ప్రభుత్వంలో వేములవాడకి జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని రావడమే ఈ వ్యాసం ఉద్దేశం. 

పాలకులు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలి

రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 (2) ప్రకారం ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉంది. బాధితులకి న్యాయం చేయడానికి ఏయే మార్పులు అవసరమో కూడా  ఆ వ్యాసంలో సూచించాను. అది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందో లేదో నాకు తెలియదు. ఆ మార్పులు అవసరం లేదని భావించినారో అంతకన్నా తెలియదు. అయితే,  జీవో  149 మార్పుకి అంత తతంగం అవసరం లేదు. ముఖ్యమంత్రి అనుకుంటే అది వారంరోజుల్లో మారుతుంది. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకుని వెళ్లాలని కోరుతున్నాను. పాలకులు ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలి. వాళ్లు చెప్పేది వినాలి. దానికి తగినట్టుగా నడుచుకోవాలి. నా ‘నేను నా నల్లకోటు’ కథల సంపుటిలోని ఓ పాత్ర చెప్పినట్టు ఎవరైతే మాట్లాడలేరో,  ఎవరైతే  ఏమీ చెప్పుకోలేరో  వాళ్ల మాటలు వినడమే పాలకులు చేయాల్సింది. 

 ప్రజల హృదయ వేదనని వినేవాడే గొప్ప పాలకుడు అవుతాడు.  తమ  బాధలను, తమ కష్టాలని చెప్పుకోలేని వ్యక్తులని అర్థం చేసుకున్నవాడే మంచి నాయకుడు అవుతాడు.  ప్రజలకు విశ్వాసాన్ని కలిగిస్తాడు. ఇప్పుడు వేములవాడ ప్రజలు మాట్లాడుతున్నారు. వాళ్ల మాటలను నేను ఈ వ్యాసం ద్వారా వినిపిస్తున్నాను.  వేములవాడ  అభివృద్ధికి ఆటంకంగా మారిన జీవో ఎంఎస్​ నెం. 149ని తొలగించాలని కోరుతున్నా.దేవస్థానం అభివృద్ధి కోసమే కాదు. పట్టణ అభివృద్ధి కోసం కూడా నిధులని కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  భవనాలు కూడా అభివృద్ధిలో భాగమే.  ఇది  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇదొక్కటే కాదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి.  ఒక ప్రాంతాన్ని సందర్శించినప్పుడు,  అక్కడ  సమస్యల పరిష్కారానికి పాలకులు కృషి చేయాలి. 

అభివృద్ధికి ఆటంకంగా జీవో 149

గత ప్రభుత్వం 24 మే 2016న మున్సిపల్​ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్​మెంట్​ డిపార్ట్​మెంట్​ జీవో, ఎంఎస్ నెం.149ని జారీ చేసింది. ఈ జీవో  ప్రకారం రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధి నుంచి 1000 మీటర్ల వరకు నిర్మాణాలు 10 మీటర్ల ఎత్తుకు మించరాదు.  ఈ జీవో  కారణంగా చాలా నిర్మాణాలు ఆగిపోయినవి.  కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ జీవోని ఎత్తివేస్తారని ప్రజలు చూశారు.  కానీ, ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. 1000 మీటర్ల  నిషేధం అసంబద్ధమైనది. 10 మీటర్లు లేదా 50 మీటర్లో సరిపోతుంది. మొత్తానికే  ఆ జీవో పరిధి నుంచి వేములవాడని తీసివేస్తే మరీ మంచిది. 

ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. పత్రికల్లో వచ్చే వ్యాసాల్లోని అభిప్రాయాలను  ముఖ్యమంత్రి చూస్తారా?  ఆయన దృష్టికి తీసుకుని వెళ్తారా అన్నది  నాకున్న సందేహం.  ఎందుకంటే 23 జులై 2024నాడు కొత్త క్రిమినల్​ చట్టాల్లో తీసుకుని రావాల్సిన మార్పులు గురించి ‘వెలుగు’ దినపత్రికలో ఓ బహిరంగ లేఖని రాశాను.  పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్నాటక ప్రభుత్వాల రివ్యూ కమిటీలను ఏర్పాటు చేశాయి.  ఆ కమిటీలు అందజేసిన సిఫారసు ప్రకారం మూడు కొత్త క్రిమినల్​ చట్టాల్లో మార్పులను తీసుకురావడానికి ఆ రాష్ట్రాలు చర్యలు చేపట్టనున్నాయి. ఈ మూడు కొత్త చట్టాల్లో తగు మార్పులను చేసుకుని లెజిస్లేచర్​లో ఆమోదింపజేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. ఆ తరువాత రాష్ట్రపతి అనుమతి పొందిన తరువాత ఆ రాష్ట్రాల్లో  ఆ మార్పులు అమల్లోకి వస్తాయి. 

- డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్​)