2024 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో రాజీనామాలు, పార్టీ ఫిరాయింపుల పర్వం ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించి దక్కని వారు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. అందరికంటే ముందుగా అభ్యర్థుల జాబితా ప్రకటించి ఎన్నికల శంఖారావం ఊదిన జగన్ కి అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తాము ఆశించిన టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు.
వచ్చే ఎన్నికల్లో తనకు కానీ, తన భర్తకు కానీ టికెట్ కేటాయించాలని కోరగా జగన్ నుండి సానుకూల స్పందన రాకపోవటంతో పద్మ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహిళా కమిషన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన పద్మ, రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపారు. అయితే, పార్టీలో సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని ఆమె తెలిపారు. జగ్గయ్యపేట నుండి టికెట్ ఆశించిన ఆమె తనకు టికెట్ కేటాయించకపోవటంతో పదవికి రాజీనామా చేశారు