కనీస మద్దతు ధరపై కేంద్రం చట్టబద్ధ హామీ ఇవ్వాలి

కనీస మద్దతు ధరపై కేంద్రం చట్టబద్ధ హామీ ఇవ్వాలి

గత కొంతకాలంగా రైతులకు మద్దతుగా నిలుస్తూ.. ప్రభుత్వంపై నూతన సాగు చట్టాల విషయంలో  విమర్శలు చేస్తున్నారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. ఇప్పుడు ఇదే విషయంపై లేటెస్టుగా మరో ట్వీట్‌ చేశారు. కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన హామీ లభించనంతవరకూ మండీల్లో రైతులు దోపిడీకి గురవుతూనే ఉంటారన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని  వరుణ్‌ ట్విటర్‌లో ట్వీట్ చేశారు.

నూతన సాగు చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు ఏడాదికాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ అంశాల్లో కేంద్రం వైఖరిపై పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన వరుణ్‌.. ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.

లఖింపుర్‌లో ఓ రైతు తన ధాన్యం కుప్పకు నిప్పు పెట్టిన వీడియోను షేర్‌ చేసిన ఆయన.. తన పంటకు తానే నిప్పు పెట్టుకునే స్థితి వచ్చిందన్నారు. మన వ్యవస్థ ఎందుకు ఇలాంటి పరిస్థితులకు దారితీస్తోందనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అన్నం పెట్టేవారిని కాపాడుకోలేకపోవడం మనందరి వైఫల్యమని... దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు.