వరవరరావుకు మరోసారి బెయిల్ పొడిగింపు

వరవరరావుకు మరోసారి బెయిల్ పొడిగింపు

ప్రముఖ విప్లవ రచయిత, విరసం నేత వరవర రావుకు బాంబే హైకోర్టు బెయిల్ ను పొడిగించింది. 2018 భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించి ఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ ఏడాది ఆగస్టు 28 నుంచి ఆయన జైలులో ఉన్నారు. అయితే.. ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో గతేడాది ఆయన బెయిల్ పిటిషన్  దాఖలు చేశారు. దీంతో మెడికల్ గ్రౌండ్స్ లో 2021 మార్చి 6న ఆరు నెలల పాటు వరవరరావుకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  ఆగస్టులో సరెండర్ అవ్వాల్సి ఉన్నా బెయిల్ ను పొడిగించాలంటూ పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు ఆమోదించింది.

ఇవాళ(శుక్రవారం) వరవరరావు సరెండర్ విషయంపై జరిగిన విచారణలో భాగంగా మరోసారి బాంబే హైకోర్టు బెయిల్ ను పొడిగించింది. థర్డ్ వేవ్ లో కేసులు భారీగా పెరుగుతున్నాయని, ఇలాంటి టైంలో మళ్లీ ఆయన్ను జైలుకు పంపించలేమని జస్టిస్ ఎస్ఎస్ షిండే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి టైంలో ఆయన్ను జైలుకు పంపించాల్సిన అవసరం ఏముందంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులను ప్రశ్నించింది.

కరోనా థర్డ్ వేవ్ 50 నుంచి 60 రోజులు ఉండే అవకాశం ఉందని, చాలా మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు  వైరస్ బారిన పడుతున్నారని గుర్తు చేసింది. కరోనా మొదటి వేవ్, రెండోవేవ్ లో కన్నా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని చెప్పింది. వాస్తవానికి వరవర రావుకు కేవలం ఆరు నెలలకు మాత్రమే బెయిల్ ఇచ్చారని, ఇప్పటికే పలుమార్లు ఆయన బెయిల్ ను పొడిగించారని NIA తరఫు అడ్వొకేట్ సందేశ్ పాటిల్ వాదించారు.

NIA వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. వరవర రావు మెడికల్ బెయిల్ ను ఫిబ్రవరి 5 దాకా పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఆయన దాఖలు చేసిన శాశ్వత బెయిల్ పిటిషన్ పై అదే రోజు విచారణ చేస్తామని స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తల కోసం..

వెంటనే జర్నలిస్టులను విడుదల చేయాలి