టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతం

టీటీడీ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతం

తిరుపతి:  తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో ఈనెల 9న వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన టిక్కెట్లను 2వ తేది ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ జేఈవో బసంత్‌కుమార్‌ తెలిపారు.

9వ తేది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థాన మండపంలో వరలక్ష్మీవ్రతం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు తిరుమాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.రూ.500 టిక్కెట్‌తో ఇద్దరు భక్తులు వరలక్ష్మీవ్రతంలో పాల్గొనవచ్చని, దీనికి 500 టిక్కెట్లను భక్తులకు ఇస్తున్నామని ఆయన అన్నారు. మరోసారి పరిశీలించి మరో వంద టిక్కెట్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ 500 టిక్కెట్లలో 300ను 2వ తేది ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని వివరించారు. మరో 200 టిక్కెట్లను 8వ తేది అమ్మవారి ఆలయ వద్ద ఆర్జిత కౌంటర్‌లో విక్రయిస్తామని చెప్పారు. ఈ ఏడాది తోళప్ప గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్ల వద్ద భక్తులు వరలక్ష్మీవ్రతాన్ని వీక్షించవచ్చన్నారు. డీపీపీ ద్వారా గాజులు, పసుపు, కంకణాలను అందజేస్తామన్నారు. వరలక్ష్మీవ్రతం రోజున ఆలయంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దుచేసి సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామన్నారు.

అన్నప్రసాద వితరణకూ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడా తొక్కిసలాటకు చోటు లేకుండా బారికేడ్లు, ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు.