భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు: దివి నుంచి భువికి గంగను తీసుకువచ్చిన భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.  భగీరథుడి జయంతి సందర్భంగా  మంగళవారం సాగర సంఘం ఆధ్వర్యంలో వనపర్తిలోని మర్రికుంటలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. భగీరథ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో సగర సంఘం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి సైతం బీఆర్ఎస్ నేతలతో కలిసి భగీరథ జయంతిలో పాల్గొని నివాళులర్పించారు. 

నాగర్ కర్నూల్ టౌన్: నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తిలోనూ భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్​ రెడ్డి భగీరథ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎంతో తపస్సు చేసిన వ్యక్తి భగీరథుడని కొనియాడారు. 

కల్వకుర్తి/చిన్నచింతకుంట, వెలుగు: కల్వకుర్తి పట్టణంలో భగీరథ జయంతి సందర్భంగా సగర సంగం నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో బీసీ సబ్ ప్లాన్ నాయకులు రాజేందర్, సదానందం, సగర సంఘం నాయకులు వివేకానంద స్వామి, చిరంజీవి, రాములు, భీమయ్య, యాదయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.  కౌకుంట్ల మండలం పేరూర్ గ్రామంలో సగర సంఘం ఆఫీసు వద్ద భగీరథ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.