అమ్మ ఆదర్శ పాఠశాల పనుల నిర్వహణలో అలసత్వం వద్దు : తేజస్​ నందలాల్​ పవార్​

పెబ్బేరు/ చిన్నంబావి, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్ని వేగంగా పూర్తి చేయాలని, ఎక్కడా అలసత్వం వహించొద్దని వనపర్తి జిల్లా కలెక్టర్​ తేజస్​ నందలాల్​పవార్ అధికారులను హెచ్చరించారు. గురువారం పెబ్బేరు, చిన్నంబావి మండలాల్లోని గుమ్మడం, యాపర్ల, కొప్పునూరు, చిన్న మారురు, వెలటూరు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తాగునీరు, వంట గది, మరుగుదొడ్లు సహా అన్ని పక్కాగా ఉండేలా మరమ్మతులకు చర్యలు తీసుకోవాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. 

ఈ సందర్భంగా యాపర్ల గ్రామంలో రైతులతో మాట్లాడిన కలెక్టర్.. ఎరువులు, విత్తనాల విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం యాపర్ల, కొప్పునూరు గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. పీఆర్​ఈఈ మల్లయ్య, పెబ్బేరు, చిన్నంబావి  తహసీల్దార్లు లక్ష్మి, ఇక్బాల్, ఎంఈఓ లక్ష్మణ్ నాయక్, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. 

నాగర్ కర్నూల్ టౌన్ : పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. కార్యక్రమంలో టీచర్ వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.

పనులు స్పీడప్ చేయాలి

మక్తల్: స్కూల్ పనులను స్పీడప్ చేయాలని నారాయణపేట జిల్లా అడిషనల్  కలెక్టర్ మయాంక్ మిత్తల్ అన్నారు. గురువారం మక్తల్ మండలంలోని కాచ్ వార్, వనయకుంట గ్రామాల్లో ప్రభుత్వ స్కూల్లో చేపట్టిన పనులను పరిశీలించారు. వర్షపు నీరు ఇంకుడు గుంతల్లో ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనులను స్పీడ్ గా పూర్తి చేసి పాఠశాల ప్రారంభమయ్యే నాటికి అప్పగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.