మనసుంటే.. ‘వన’మహోత్సవమే!

‘పర్యావరణ మార్పు’ విపరిణామాలు నేరుగా ఇంటింటినీ తాకుతున్నా ఎవరికీ పట్టడం లేదు. కర్భన ఉద్గారాల వల్ల భూతాపోన్నతి పెరగటంతో వచ్చిన పెనుమార్పులు ప్రపంచాన్నే వణికిస్తున్నాయి.  ఫలితంగా పెరిగిన  కరువు పరిస్థితులు,  అకాల వర్షాలు, వరదలతో  భారత  వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.  గత ఏడెనిమిదేండ్లలో  వచ్చిన పర్యావరణ మార్పులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆహారోత్పత్తి, భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.  ఉత్పత్తి తగ్గి,  పండిన పంటా నేలపాలౌతున్న దుస్థితి.  నిన్నటికి నిన్న  ఖమ్మం,  నల్గొండ,  కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు,  వరదలతో  ఎంతో  పంట, ఆస్తి నష్టం వాటిల్లింది.  

లికాలం  ముదురుతుంటే  నిండు వేసవిలో ఉన్నట్టుంది.  ఇవేవీ  పర్యావరణ దృష్టి కోణంలో  సమీక్షలకు  నోచుకోవడం లేదు.  గత  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ ఏమిచ్చింది?   పేరు మార్చి ప్రస్తుత  ప్రభుత్వం  చెబుతున్న ‘వన మహోత్సవం’లో  ఏం జరుగనుంది?  నిజాయితీతో,  నిర్మాణాత్మకంగా  కృషి చేస్తే తప్ప,  ఇవన్నీ కడకు అలంకారప్రాయంగా మిగిలే ప్రమాదముంది. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో  పూనిక వహిస్తే తప్ప పర్యావరణ  మార్పుతో  సంభవించే దుష్ఫరిణామాల నుంచి మానవాళికి రక్షణ లేదు.  ప్రపంచ దేశాలన్నీ, 2015 పారిస్  ఒప్పంద సమయంలో అంచనా వేసిన దానికన్నా వేగంగా విధ్వంసం ముంచుకు వస్తోంది. 

అందులోనూ దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశం ప్రమాదపు అంచున ఉందని ‘పర్యావరణ మార్పు’లపై  ఐక్యరాజ్యసమితి (యూఎన్) ఏర్పరచిన అంతర్​ ప్రభుత్వాల కమిటీ (ఐపీసీసీ) పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి.  మరి, దీన్నుంచి విముక్తికి మనం ఏం చేస్తున్నాం?  కేంద్రం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ (పర్యావరణ శాఖలోనే) విభాగాన్ని ఏర్పరచి, పార్లమెంట్ స్థాయీ సంఘాన్ని నియమించి, నీతి ఆయోగ్​కి పర్యవేక్షణ  బాధ్యత అప్పగించింది.  పర్యావరణ  మార్పుల  వల్ల  సంభవించే  విపరిణామాలను ముందే అంచనావేసి నివారించేలా, ఎదుర్కొని తట్టుకునేలా, అనివార్యమైన అంశాలను అలవరచుకునేలా పలు ప్రతిపాదనలున్నాయి. కానీ, వాటి ఆచరణే సవ్యంగా లేదు.  బొగ్గు,  పెట్రోఉత్పత్తులు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించాలి.  సౌర- పవన వంటి పునర్వినియోగ వనరుల నుంచి శుద్ధ ఇంధనాల  తయారీని పెంచాలి.  అడవుల్ని  విస్తారంగా  పెంచి  హరితం వృద్ధి చేయాలి.  విరివిగా  మొక్కల్ని పెంచడం ద్వారా  పచ్చదనాన్ని వృద్ధి చేసే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి విభిన్న కార్యక్రమాలను అమలుపరిచాయి.  ఆశించిన  స్థాయిలో  ఫలితాలు సాధించామా అన్న లోతైన సమీక్షలే లేవు.   తెలంగాణలో  పదివేల కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసి దాదాపు తొమ్మిదేండ్ల పాటు నిర్వహించిన ‘హరితహారం’  ఆశించిన  స్థాయిలో  ఫలితాలివ్వలేదు. దాని స్థానే, ‘వనమహోత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని 

ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. కేవలం పేరు మార్పు కాకుండా, లోపాలను సరిదిద్ది లక్ష్యాలను సాధించే కార్యక్రమంగా అమలు చేస్తేనే ఫలితం ఉంటుంది.

దృక్పథంలోనే లోపం

తెలంగాణకు ‘హరితహారం’ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.  గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో... స్థానిక సంస్థలకు నిర్దిష్ట  బాధ్యతల్ని, లక్ష్యాల్ని అప్పగించింది.  అనంతరం అంతటా సొంత నర్సరీలనూ ఏర్పరచింది.  లక్షించిన సంవత్సరాల్లో  దాదాపు 250 కోట్ల  మొక్కల్ని నాటి,  సంరక్షించి తద్వారా పచ్చదనాన్ని వృద్ధి చేయాలని చెప్పింది.  తొమ్మిదేండ్ల కాలంలో 10,417 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు అధికారిక సమాచారం.  ఏటా దీన్నొక  పండుగలా  నిర్వహించేవారు.  సరైన మొక్కల్ని  ఎంపిక చేయకపోవడం, మొక్కల లభ్యత  లేక కొంత, ఖాళీ స్థలాలు అందుబాటులో లేకపోవడం, తదనంతర పర్యవేక్షణ లోపం ఇలా అన్ని స్థాయిల్లో చిత్తశుద్ధి కొరవడి  రకారకాల కారణాల వల్ల కార్యక్రమం ఆశించిన ఫలితాలివ్వలేదు. 

ఆర్బాటంగా  కార్యక్రమాన్ని  ప్రకటించడం, నాయకులు ఫొటోలు దిగడం,  నాటిన చోటనే  ప్రతిఏటా నాటడం,  మీడియాలో  విస్తృత ప్రచారం పరిపాటిగా మారింది.  నిజానికి  ఒక గొప్ప ఆదర్శంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నాటి ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించడంతోపాటు, ఆయన కార్యాలయం నుంచి ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి సమన్వయకర్తగా ఉండి పర్యవేక్షించేవారు. మొక్కలు (అవీ పరిమిత జాతులవి) నాటాలి అనే తప్ప  పచ్చదనాన్ని అన్ని స్థాయిల్లో,  అన్నివిధాలుగా పెంచాలనే  సమగ్ర దృక్పథం ఈ ప్రాజెక్టులో లోపించింది.  
భూ వినియోగ విధానం ఉండాలిమొక్కలు నాటడానికి స్థలం అందుబాటులో లేకపోవడం కూడా ఒక సమస్యే!  ఒకప్పుడు  ప్రతి గ్రామ పొలిమేరల్లో, శివార్లలో బంజరు భూములు, గైరాన్- పడావ్ భూములు, ఇతర ప్రభుత్వ స్థలాలుండేవి. ఇండ్ల మధ్య కూడా ఖాళీ స్థలాలుండేవి.  ఇప్పుడు  జనాభా అధికమవడం, నగరాలు, పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా భూముల విలువలు అసాధారణంగా పెరగటంతో, డిమాండ్ పెరిగి ఖాళీ స్థలాలు లేకుండాపోయాయి. పైగా నగరాలు, పట్టణాల చుట్టూ వందల హెక్టారులు నివాస కాలనీల (రియల్ ఎస్టేట్) కోసం కొనుగోలు చేసి, ఏ నిర్మాణం లేకుండా పడావ్  వేసుకొని ఉన్నారు.  ఏండ్ల తరబడి నిరుపయోగంగా... అటు నిర్మాణాలు లేవు, ఇటు వ్యవసాయమూ జరగట్లేదు. అలా రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఖాళీగా పడిఉన్నాయి.  ఇదంతా ఆహారోత్పత్తిని ప్రభావితం చేస్తోంది.  ప్రభుత్వం ఒక సమగ్ర భూ వినియోగ విధానం- చట్టం తెచ్చి.. అయితే వ్యవసాయం చేయాలి  లేదా  పచ్చదనం విస్తరించేలా  మొక్కలు నాటి చెట్లు పెంచాలని నిర్బంధం విధిస్తే  గ్రీన్​కవర్  పెరగటానికి ఆస్కారం ఉంటుంది.  పౌర సమాజం, ప్రజా సంఘాలు, బడులు, - కాలేజీలు,  జనసమూహాలను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలి. అప్పుడే సరైన ఫలితాలుంటాయి.

సత్ఫలితాలే ఉత్సవం

వన మహోత్సవం కేవలం పేరులోనే కాకుండా ఫలితాల్లో ప్రతిబింబించాలి. ఇదేం కొత్తపేరు కాదు. 1950 నాటి నుంచీ వివిధ రూపాల్లో ఉన్నదే.  ‘కార్యక్రమ కేంద్రకం’గా  కాకుండా  ఫలితాల  లక్ష్యంతో  మొక్కలు నాటే  కార్యక్రమం ఉండాలి.  ‘మూసీ పునరుజ్జీవం’ ప్రాజెక్టును, నగరాలు,  పట్టణాల్లో  చెరువులు, కుంటలు,  నాలాలు, ఇతర ప్రభుత్వ స్థలాలను భూకబ్జాల నుంచి విముక్తం చేసే  ‘హైడ్రా’ వంటి   ప్రగతిశీల  కార్యక్రమాలను  వనమహోత్సవంతో అనుసంధానం చేయాలి.  పక్కా  ప్రణాళిక ప్రకారం  మొక్కలు నాటే  కార్యక్రమాన్ని చేపట్టి,  సత్ఫలితాలు సాధించడానికి కొన్ని నిర్దిష్ట చర్యలుండాలి.  గడ్డి, పొదలు, స్థానిక జీవజాతుల  చిన్న,- పెద్ద మొక్కల్ని పెంచడం ద్వారా సమగ్ర పచ్చదనాన్నే కాకుండా భూసారాన్ని వృద్ధి చేయాలి.  

నదులు, వాగుల  మూలాల్లో  ప్రకృతి వనరుల నుంచి లభించే జలధారల్ని పరిరక్షించడమే కాకుండా వాననీటి సంరక్షణ చర్యలు, నీటి నిలువ చర్యల ద్వారా భూగర్భజల మట్టాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలి.  స్థానికంగా నర్సరీల వృద్ధి,  మొక్కలు నాటడం,- సంరక్షించడం వరకు అన్ని దశల్లోనూ స్థానికులు,  వివిధ  సామాజికవర్గ  జనసమూహాలు, స్వచ్ఛందసంస్థలు, ప్రజాసంఘాలు, బడులు-, కాలేజీలు,  ఇతర  విద్యాసంస్థలను భాగస్వామ్యం చేయాలి. 

పర్యావరణ స్పృహ పౌర సమాజంలో రావాలి

నివాసాల్లోని  దైనందిన గృహవినియోగ, జీవ వ్యర్థాలను  సహజ- సేంద్రియ ఎరువులుగా మార్చే ప్రక్రియని ఎక్కడికక్కడ  చేపట్టాలి.  తద్వారా భూసారాన్ని వృద్ధి చేయడమే కాకుండా స్థానికంగా కూరగాయలు తదితర ఆహారోత్పత్తులకు ప్రయత్నించాలి. అన్ని చర్యల్ని సమన్వయపరచడం ద్వారా లభించే ఆహారోత్పత్తులతో స్థానికంగా ఉండే పిల్లలు, మహిళలు, ముఖ్యంగా గర్భిణులు తదితర అవసరార్థులైన వారికి పౌష్టికాహారం అందజేసే కృషినీ దీనికి అనుసంధానం చేయాలి.  

మనసు పెట్టి చేస్తేనే  వనమహోత్సవానికి సార్థకత!  భూతాపోన్నతి వల్ల సంభవిస్తున్న పర్యావరణ మార్పులు విదిల్చే చెర్నాకోల కొస... ఏదో రూపంలో  మన శరీరాలకూ తాకుతోంది.  ముప్పు అంచనాలకు మించిన వేగంతో ముంచుకువస్తోంది.  అందరం అప్రమత్తం కావాల్సిందే,  కార్యాచరణ మొదలెట్టాల్సిందే!  పర్యావరణ స్పృహ పెంచుకొని  బాధ్యతాయుతంగా ఉండాల్సిన  అవసరం  అటు ప్రభుత్వాలకే  కాకుండా ఇటు  పౌరసమాజానికీ  స్థూలంగా,  ప్రతివ్యక్తికీ 
ప్రత్యేకంగా ఉంది.