ఇది పాలమూరు ఆత్మగౌరవ ఎన్నిక : వంశీచంద్​రెడ్డి 

కొత్తకోట, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికలు పాలమూరు ఆత్మగౌరవానికి ఢిల్లీ అహంకారానికి మధ్య జరుగుతున్నాయని  కాంగ్రెస్​ ఎంపీ క్యాండిడేట్​ వంశీచంద్​రెడ్డి తెలిపారు. కొత్తకోట పట్టణంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి కార్నర్  మీటింగ్​లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్​రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వంశీచంద్​రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్​ నాయకులను రెండు సార్లు ఎంపీగా గెలిపిస్తే మహబుబ్​నగర్​ జిల్లా ప్రజలను బానిసలుగా చూసిన ఘనత కేసీఆర్​దేనన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి  గుణపాఠం చెప్పారన్నారు. ఎంపీగా గెలిస్తే పాలమూరు జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రతి ఎకరాకు నీళ్లు అందించే బాధ్యత తనదేనని తెలిపారు.

తన గెలుపును జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. భారీ మెజార్టీతో తనను గెలిపించి పాలమూరు దెబ్బను బీజేపీకి రుచి చూపించాలని కోరారు. ఎమ్మెల్యే జీఎమ్మార్​ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతిపరులను ఇంట్లో కుర్చోబెట్టిన ఘనత పాలమూరు జిల్లా ప్రజలదన్నారు. పార్లమెంట్​ ఎన్నికలలో చల్లా వంశీచంద్​రెడ్డికి దేవరకద్ర నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఎస్సీసెల్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెపాగ ప్రశాంత్, మేస్ర్తీ శ్రీను, బీచుపల్లి యాదవ్, పీజే బాబు, వేముల శ్రీనివాస్​రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్​రెడ్డి, మోహన్​రెడ్డి పాల్గొన్నారు.

పాలమూరు: పేద ప్రజలను నట్టేట ముంచే పార్టీలను ఓడించాలని వంశీచంద్ రెడ్డి కోరారు. మహబూబ్​నగర్  పట్టణంలోని చిరు వ్యాపారస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్ధానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు.

చిరు వ్యాపారుల అభివృద్ధి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు. జీఎస్టీ పేరుతో దేశంలో పేద, మధ్య తరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను బీజేపీ ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఫలాలను భవిష్యత్  తరాలకు అందించేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్పీ వెంకటేశ్, చాంద్, వెంకటేశ్, నాయకులు బాలరాజు, శివలీల, రాములమ్మ పాల్గొన్నారు.