మతోన్మాద బీజేపీతో దేశానికి ప్రమాదం : వంశీచంద్ రెడ్డి

పాలమూరు, వెలుగు: బీజేపీ పాలన దేశానికి అత్యంత ప్రమాదకరమని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో సీసీఐ పార్లమెంట్  స్థాయి సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బాలకిషన్  అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ సంపదను దోచి దాచిందన్నారు. 

ఇలాంటి మతోన్మాద పార్టీని కాలగర్భంలో కలిపేందుకు ఇండియా కూటమి పురుడు పోసుకుందన్నారు. మోదీ సర్కార్  విష ప్రచారం చేస్తోందని, మతం పేరుతో చిచ్చుపెట్టి ఓట్లు పొందేందుకు కుట్రలు చేస్తోందన్నారు. ఈ పార్టీని గద్దె దించేందుకు ఐక్యంగా పని చేయాలని ఆయన కోరారు. సీపీఐ వనపర్తి, రంగారెడ్డి, నారాయణపేట జిల్లా కార్యదర్శులు విజయరాములు, జంగయ్య, కొండన్న, వికారాబాద్  జిల్లా నాయకులు బషీర్, పరమేశ్ గౌడ్, పర్వతాలు పాల్గొన్నారు.