మగాళ్ల ‘మురుగప్ప’ గ్రూప్ పై ఆమె తిరగబడింది

మగాళ్ల ‘మురుగప్ప’ గ్రూప్ పై ఆమె తిరగబడింది

ముంబై:  ఆడవాళ్లంటే వివక్ష ఇక్కడా, అక్కడా అని లేకుండా అంతటా పాకి ఉంది. పెద్ద కార్పొరేట్ దిగ్గజమైనా దీనికి మినహాయింపు కాకుండా పోయింది. 119 ఏళ్ల నాటి మురుగప్ప గ్రూప్‌‌లో కూడా ఇదే పరిస్థితి. పురుషులు మాత్రమే ప్రాతినిధ్యం వహించే ఈ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ బోర్డులో తమకు అవకాశం కల్పించాలని వల్లి అరుణాచలం ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. కాలం చేసిన తన తండ్రి ప్లేస్‌‌లో తనను తీసుకోవాలని వల్లి అరుణాచలం కోరుతున్నారు. గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అంబాడి ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌లో బోర్డు సీటును తాము కోరామని, కంపెనీలో మాకున్న వాటా మార్కెట్ వాల్యు ప్రకారం తమకు అవకాశం ఉంటుందని న్యూయార్క్‌‌లోఉంటోన్న అరుణాచలం చెప్పారు. ‘నేను, మా చెల్లి ఇద్దరం బోర్డుకి ప్రాతినిధ్యం వహించడానికి అర్హులమే. ఇద్దరికీ అనుభవం కూడా ఉంది’ అని అరుణాచలం చెప్పారు. అంబాడి ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌లోని బోర్డులో ఆనవాయితీగా వస్తోన్న సంప్రదాయం ప్రకారం కేవలం ఫ్యామిలీకి చెందిన పురుషులు మాత్రమే ఉండాలి. నాన్న కోరిక మేరకు తాము ఈ లింగ వివక్షపై పోరాడుతున్నామని తెలిపారు. హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం, ఫ్యామిలీకి మహిళలు హెడ్‌‌గా ఉండొచ్చు. అరుణాచలం, ఎంవీ మురుగప్పన్‌‌కు పెద్ద కూతురు. మురుగప్పన్‌‌ 2017 సెప్టెంబర్‌‌‌‌లో మరణించారు. అరుణాచలం న్యూక్లియర్ ఇంజనీరింగ్‌‌‌‌ చేశారు.

మహిళలందరి కోసం నా పోరాటం…

హిందూ అన్‌‌డివైడ్ ఫ్యామిలీస్(హెచ్‌‌యూఎఫ్‌‌ల) ప్రకారం, మహిళలు ఫ్యామిలీ కర్త లేదా హెడ్‌‌గా ఉండటానికి వీలులేదు. పురుషులతో సమానమై హక్కులు ఈ కుటుంబాల్లోని మహిళలకు ఉండవు. అయితే కొడుకులకున్నట్టు, కూతుర్లకు సమాన హక్కులు కల్పించడానికి హిందూ సక్సెషన్(సవరణ) యాక్ట్ 2005 తెచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం, కొడుకు, కూతురు ఇద్దరికీ సమానహక్కులుంటాయి. కుటుంబ పితృస్వామ్యంపై అరుణాచలం పోరాడుతున్నారు. ఫ్యామిలీ వ్యాపారాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఫ్యామిలీలోని ఇతర సభ్యులను కూడా ఆమె కలిశారు. అయితే నవంబర్‌‌‌‌లో భేటీ అయిన అంబాడి ఇన్వెస్ట్‌‌మెంట్స్ బోర్డు తన అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అరుణాచలం చెప్పారు. తమ ఫ్యామిలీ పెద్ద ఎంవీ సుబ్బయ్యకు కూడా ఈ విషయం గురించి చెప్పినట్టు తెలిపారు. ‘నవంబర్ 2019లో  అంబాడి ఇన్వెస్ట్‌‌మెంట్స్ బోర్డు మీటింగ్ జరిగింది. బోర్డులో నన్ను చేర్చుకునే విషయంపై చర్చ  కూడా జరిగింది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది చాలా జనరల్ విషయం, అస్పష్టంగా ఉందని తేల్చేశారు’ అని అరుణాచలం ఆవేదన వ్యక్తం చేశారు. మురుగప్పన్ ఫ్యామిలీ తరువాత జనరేషన్స్‌‌కు నాయకత్వ బాధ్యతలు వహించే సుబ్బయ్యకు, గ్రూప్ మాజీ ఎగ్జిక్యూటివ్‌‌ ఛైర్మన్‌‌ ఎంఏ అలగప్పన్‌‌కు ఈ విషయంపై ఈమెయిల్స్ పంపామని, కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి సమాధానాలు రాలేదని పేర్కొన్నారు. ‘మహిళలందరి కోసం నా పోరాటం. లింగవివక్షపై నా పోరాటం’ అని అరుణాచలం చెప్పారు.