హైదరాబాద్: బీఆర్ఎస్ లో ముగ్గురు లీడర్లు పోటీపడుతున్నారు. ఎవరికి వారుగా పై చేయి సాధించేందుకు ఉత్సహం చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. క్రియాశీల రాజకీయాల గురించి ఆయన మాట్లాడటం లేదు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి.. తీహార్ జైలుకు వెళ్లొచ్చిన కవిత ఇటీవలే ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతున్నారు. నిన్న మాజీ మంత్రి హరీశ్ రావును గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆమె స్వయంగా ఠాణాకు వెళ్లి సంఘీభావం తెలిపారు. వందలాది మంది అనుచరులతో ఆమె గచ్చిబౌలికి చేరుకోవడం తో కొంత సేపు ఉద్రిక్తత నెలకొంది.
హరీశ్ రావును కలిసి సంఘీభావం ప్రకటించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు వెళ్లి పాడి కౌశిక్ రెడ్డితో భేటీ అయ్యారు. తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. అంతకు ముందు నిన్న ఉదయం పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తున్నారన్నవిషయం తెలుసుకున్న హరీశ్ రావు కొండాపూర్ లోని పాడి నివాసానికి చేరుకొన్నారు ఎమ్మెల్యేలతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఓ పోలీసు అధికారితో వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. దీంతో ఆయనను అరెస్టు చేసి గచ్చిబౌలి పోలీసు స్టేషన్ కు తరలించారు. హరీశ్ రావు ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు.
గతంలో సోషల్ మీడియాను పెద్దగా వాడుకోని హరీశ్ రావు ట్విట్టర్ లో ఫుల్ యాక్టివ్ అయ్యారు. తెలంగాణ భవన్ కు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ సర్కారుకు కౌంటర్ ఇస్తున్నారు. అదే సమయంలో జిల్లాల్లో పర్యటిస్తూ దూకుడు పెంచారు. అటు కవిత కూడా బీసీ జెండా ఎజెండాతో కుల సంఘాలతో సమావేశమవుతున్నారు. జాగృతిని బలోపేతం చేస్తున్నారు. సర్కారుపై ట్వీట్లతో ఫైట్ చేస్తున్నారు. రాజకీయాలకు బ్రేక్ చెప్పి వెళ్లిన కేటీఆర్.. తిరిగి సీన్ లోకి వచ్చారు. ఎక్కడ ఉన్నా స్పందిస్తున్నారు. సర్కారుపై విమర్శలు సంధిస్తున్నారు. వర్చువల్ గా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ సర్కారు తీరును తప్పుపడుతున్నారు.
ALSO READ : పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి: భట్టి విక్రమార్క
తెలంగాణ భవన్లోనే ఎక్కువ టైం ఉంటున్నారు. ఎప్పటికప్పుడు శ్రేణులను ఉత్సాహ పరుస్తున్నారు. ప్రజలను కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ముగ్గురు లీడర్లు తమ అప్పర్ హ్యాండ్ కోసం దూకుడుగా ముందుకు వెళ్తుండటం గమనార్హం. ఇదే తరుణంలో ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నా.. పెద్ద మనిషిగా సలహాలు ఇవ్వాలని కోరుతున్నా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. కేటీఆర్, కవిత, హరీశ్ రావు ఎవరికి వారుగా దూకుడు ప్రదర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఈ పందెంలో ఎవరు నెగ్గుతారనే చర్చ నడుస్తోంది.