పాలమూరుకు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలే: మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి

  • వేల కోట్లు ఖర్చుపెట్టి నీళ్లివ్వని మూర్ఖులు బీఆర్ఎస్ లీడర్లు
  • భూ నిర్వాసితులకు పూర్తి స్థాయి పరిహారం ఇస్తామని హామీ
  • రేవంత్ నాయకత్వంలో ముందుకెళ్తున్నం: జూపల్లి
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల పరిశీలన

నాగర్​కర్నూల్/మహబూబ్​నగర్​/జడ్చర్ల టౌన్, వెలుగు: ఉమ్మడి పాలమూరులో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాలమూరు – రంగారెడ్డి కోసం రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వని మూర్ఖులు.. బీఆర్ఎస్ లీడర్లు అని మండిపడ్డారు. 90శాతం పనులు తామే పూర్తి చేశామంటూ చెప్పుకుంటున్నారని విమర్శించారు. అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఎమ్మెల్యేలతో కలిసి ఉత్తమ్ బుధవారం పరిశీలించారు. తర్వాత నాగర్​కర్నూల్ కలెక్టరేట్​లో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ‘‘సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నాయకత్వంలో ఉమ్మడి మహబూబ్​నగర్​లోని పాలమూరు–రంగారెడ్డి, రాజీవ్ గాంధీ భీమా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల, జవహర్ నెట్టెంపాడు, కోయిల్​సాగర్, గట్టు ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం.

ఎన్నికల టైమ్​లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం’’అని ఉత్తమ్ అన్నారు. భూ నిర్వాసితులకు త్వరలో పూర్తి స్థాయిలో డబ్బులు అందజేస్తామని తెలిపారు. ప్రాజెక్టుల భూ సేకరణకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను గురువారం సాయంత్రంలోగా స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జే.పాటిల్​కు అందజేయాలని కలెక్టర్లకు ఉత్తమ్ ఆదేశించారు. ఇక నుంచి ప్రతి రెండు నెలలకోసారి ప్రాజెక్టులపై రివ్యూ చేస్తానని తెలిపారు.  

నిర్వాసితులకు న్యాయం చేస్తాం: జూపల్లి

ఎన్నికల ముందు నార్లాపూర్​లో ఒకే ఒక పంప్ ఆన్ చేసి జాతికి అంకితం చేసిన ఘనులు బీఆర్ఎస్ లీడర్లు అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ‘‘కేఎల్ఐలోని ఎల్లూరు పంప్​హౌస్​లో (2020) రెండు పంపులు మునిగి పాడైతే నాలుగేండ్లు కూడా రిపేర్ చేయలేదు. పాలమూరు జిల్లా వ్యక్తే సీఎం కావడం మన అదృష్టం. రేవంత్ నాయకత్వంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఎకరాకూ సాగునీళ్లు అందిస్తాం.

భూసేకరణతో పాటు నిర్వాసితులకు న్యాయం చేస్తాం’’అని జూపల్లి అన్నారు. అంతకుముందు నార్లాపూర్ హెడ్ రెగ్యులేటరీ, కేఎల్ఐ సిస్టర్న్స్ ను సందర్శించిన మంత్రులకు ఇరిగేషన్ అధికారులు అక్కడి పరిస్థితులను వివరించారు. రివ్యూ మీటింగ్​లో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీహరి, విజయుడు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఉద్దండాపూర్ నిర్వాసితులను ఆదుకుంటాం: ఉత్తమ్

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని మంత్రి ఉత్తమ్ అన్నారు. పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయితే 12లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ రిజర్వాయర్​ను మంత్రి జూపల్లితో కలిసి ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ‘‘ఉదండాపూర్ రిజర్వాయర్ కింద ఆర్ అండ్ ఆర్​కు రూ.45 కోట్లు మంగళవారం రాత్రే రిలీజ్ చేశాం. ఉదండాపూర్​తో పాటు ఇతర రిజర్వాయర్లతో ముంపునకు గురైన వారికి పునరావాసం కల్పిస్తాం’’అని ఉత్తమ్ అన్నారు.