డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. 45ఏళ్ల వయసులో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి 11వ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాజ్ భవన్ లో గవర్నర్ బేబీ రాణి మౌర్య సీఎంతోపాటు నలుగురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2002 నుంచి 2006 వరకు నాలుగేళ్ల పాటు బీజేపీ రాష్ట్ర యువ మోర్చాకు అధ్యక్షుడిగా పనిచేసిన పుష్కర్ సింగ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి అనూహ్యంగా ఏకంగా సీఎం పదవినే చేపట్టి హాట్ టాపిక్ గా నిలిచారు. అలాగే సీఎంతోపాటు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు సత్పాల్ మహారాజ్, హారక్ సింగ్ రావత్, బన్సీధర్ భగత్, యశ్ పాల్ ఆర్య మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
నాలుగు నెలల వ్యవధిలో ముగ్గురు సీఎంలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత నాలుగు నెలల వ్యవధిలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. గత మార్చి నెలలో పార్టీలో అసమ్మతి చెలరేగడంతో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న త్రివేంద్రసింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆయన తర్వాత మార్చి 10న తీరధ్ సింగ్ రావత్ సీఎంగా ప్రమాణం చేశారు. ఇప్పటి వరకు సీఎంగా కొనసాగిన ఆయన వచ్చే సెప్టెంటర్ 10వ తేదీలోపు అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపధ్యంలో ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనేలేదని స్పష్టం చేసింది. దీంతో తీరధ్ సింగ్ ఆశలు అడియాసలయ్యాయి. తప్పని పరిస్థితుల్లో రాజ్యాంగంలోని నిబంధనలకు తలొగ్గి సీఎం పీఠం దిగాల్సి వచ్చింది.
