చివరి దశలో ఉత్తరకాశీ టన్నెల్ వర్కర్స్ రెస్క్యూ ఆపరేషన్..

చివరి దశలో ఉత్తరకాశీ టన్నెల్ వర్కర్స్ రెస్క్యూ ఆపరేషన్..

ఉత్తరాఖండ్: ఉత్తర కాశీ సిర్క్యారా వద్ద టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల కోసం 12 నెజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ టీం చేస్తున్న ప్రయత్నాలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. రెస్క్యూ టీం తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు సొరంగంలో 46 మీటర్ల వరకు డ్రిల్లింగ్ చేశారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చేరుకునేందుకు రెస్క్యూ టీం సిబ్బంది అతి సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

నవంబర్ 12 న ఉత్తరా ఖండ్ చార్ ధామ్ మార్గంలో నిర్మాణంలో ఉన్న  సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో 41 మంది కార్మికులు 12 రోజులుగా అవతలి వైపు చిక్కుకొని ఉన్నారు. కార్మికులను రక్షించేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ప్రధాని మోదీ తో సహా, ఉత్తరాఖండ్ సీఎం ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని చర్యలు వేగవంతం చేయాలని కోరారు. 

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ థామి ఇవాళ( నవంబర్ 24)  ఉత్తర కాశీ సొరంగం లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ ను పరిశీలించారు. చివర దశ రెస్క్యూ ఆపరేషన్ ను వేగంగా , పూర్తి జాగ్రత్తతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 

సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల విలువైన ప్రాణాలు కాపాడే బాధ్యత మనందరిపై ఉంది. రెస్క్యూ టీం జాగ్రత్తగా , వేగంగా పగలు రాత్రి శ్రమించాల్సి ఉందని థామి అన్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. సొరంగం లోపల కార్మికుల ఆరోగ్యస్థితి బాగానే ఉంది.. వారిని రక్షించేందుకు ఇంకా 14 మీటర్లు తవ్వాల్సి ఉందని తెలిపారు. అయితే ఊహించని అడ్డంకుల వల్ల సహాయక చర్యలు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపారు.