- ఫెడ్ చైర్మన్ స్పీచ్‌తో..మార్కెట్ పతనం తప్పదా!
- శుక్రవారం భారీగా తగ్గిన యూఎస్ మార్కెట్‌లు, నిఫ్టీ ఫ్యూచర్స్
బిజినెస్ డెస్క్, వెలుగు: ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పీచ్‌తో యూఎస్ మార్కెట్‌లు శుక్రవారం కుప్పకూలాయి. మిగిలిన దేశాల ఫ్యూచర్ మార్కెట్‌లు కూడా భారీగా పడ్డాయి. సింగపూర్‌లోని నిఫ్టీ ఇండెక్స్ ఎస్‌జీఎక్స్ నిఫ్టీ సైతం శుక్రవారం 1.22 శాతానికి పైగా నష్టపోయి 17,444 వద్ద సెటిలయ్యింది. దీని బట్టి సోమవారం సెషన్‌లో దేశ స్టాక్ మార్కెట్‌ల పతనం తప్పేటట్టు లేదు. గత కొన్ని సెషన్ల నుంచి 17,500–17,800 మధ్య కదిలిన నిఫ్టీ, సోమవారం సెషన్‌లో డౌన్‌సైడ్ బ్రేక్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో జరిగే ఫెడ్ పాలసీ మీటింగ్‌లో వడ్డీ రేట్ల పెంపు 75 బేసిస్ పాయింట్ల కంటే తక్కువ ఉంటుందని గత రెండు వారాలుగా గ్లోబల్ ఇన్వెస్టర్ల అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్‌లు భారీగా పెరిగాయి. తాజాగా జరిగిన సింపోజియంలో ఇన్‌ఫ్లేషన్‌ను కట్టడి చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని, ఇందుకోసం వడ్డీ రేట్ల పెంపు తదుపరి పాలసీ మీటింగ్‌లలో కూడా ఉంటుందని జెరోమ్ పావెల్ పేర్కొన్నారు. మొత్తం 9 నిమిషాల పాటు జరిగిన ఈ స్పీచ్‌లో ‘ధరలను నిలకడగా ఉంచాలి’ అని ఆయన పదేపదే అనడం గమనించాలి. సమీప కాలంలో ప్రజలకు, బిజినెస్‌లకు కష్టమైనా, ధరల పెరుగుదలను కట్టడి చేయడానికి రేట్ల పెంపు తప్పదని ఆయన పేర్కొన్నారు. దీని బట్టి సెప్టెంబర్‌లో జరిగే ఫెడ్ మీటింగ్‌లో వడ్డీ రేట్లను మరో 75 బేసిస్ పాయింట్లు పెంచుతారనే ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఫలితంగా ఆర్‌బీఐ కూడా తన తదుపరి పాలసీ మీటింగ్‌లో వడ్డీ రేట్ల పెంపును కొనసాగిస్తుందని అంచనాలూ పెరిగాయి. కాగా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్వెస్ట్‌మెంట్లపై ఎక్కువ వడ్డీ వస్తే ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌లు వెళ్లిపోతాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్‌లపై తీవ్రంగా ఉంటుంది.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
1‘ ముందుకెళ్లే కొద్దీ ఎకానమీలో ‘కొంత బాధ’ తప్పదని ఫెడ్ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. వడ్డీ రేట్ల పెంపు అందుబాటులోని డేటా ఆధారంగా ఉంటుందని ఆయన చెప్పినప్పటికీ, సెప్టెంబర్ పాలసీ మీటింగ్‌లో వడ్డీ రేట్ల పెంపు ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. అనుకున్నదాని కంటే ఎక్కువ కాలం పాటు మానిటరీ పాలసీ కఠినంగా ఉంటుండడంతో పాటు ఎకానమీలో వడ్డీ రేట్లు గరిష్ట లెవెల్‌లో ఉండడంతో మార్కెట్‌లు ఆందోళన పడుతున్నాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు.
2 ‘ఫెడ్ జులై ఎఫ్‌ఓఎంసీ డోవిష్ (మానిటరీ పాలసీ సులభం) కామెంట్స్‌ను చూసి సంబరపడ్డ ఇన్వెస్టర్లు, వచ్చే ఏడాది నుంచే వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని కూడా అంచనావేశారు. ఈ ఇన్వెస్టర్లు తాజా ఫెడ్ కామెంట్స్‌తో నిరుత్సాహపడ్డారు’ అని ప్రభుదాస్ లీలాధర్ క్వాంట్ ఎనలిస్ట్ రితికా ఛాబ్రా అన్నారు.
3 మరోవైపు పావెల్ కామెంట్స్ మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉన్నాయని యాక్సిస్ సెక్యూరిటీస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ నవీన్ కులకర్ణి పేర్కొన్నారు. మార్కెట్‌లో ట్రెండ్ రివర్స్ కాదని, కానీ, సమీప కాలంలో ఒడిదుడుకులు తప్పవని అంచనావేశారు.
4 ‘వరసగా ఆరు వారాల పాటు పెరిగిన తర్వాత నిఫ్టీలో కిందటి వారం కరెక్షన్ వచ్చింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కామెంట్స్‌తో గ్లోబల్ మార్కెట్‌లు భారీగా పడ్డాయి. ఫలితంగా రానున్న వారాల్లో కూడా నిఫ్టీలో కరెక్షన్ కొనసాగొచ్చు. ఈ వారం గ్లోబల్ మార్కెట్ కదలికలు కీలకం. లోకల్‌గా చూస్తే జీడీపీ నెంబర్లు, ఆగస్టు నెలకు సంబంధించిన వెహికల్ అమ్మకాల డేటా మార్కెట్ కదలికలను నిర్ణయిస్తాయి’ అని స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్ ఎనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు.
9 నిమిషాల స్పీచ్.. మస్క్, బెజోస్‌కు రూ.96 వేల కోట్లు నష్టం
ఫెడ్ చైర్మన్ శుక్రవారం ఇచ్చిన తొమ్మిది నిమిషాల స్పీచ్ దెబ్బకు ప్రపంచ కుబేరుల సంపద భారీగా తగ్గింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం, శుక్రవారం ఒక్క రోజే యూఎస్ బిలియనీర్ల సంపద 78 బిలియన్ డాలర్లు తగ్గింది. టెస్లా బాస్ ఎలన్ మస్క్ సంపద 5.5 బిలియన్ డాలర్లు తగ్గగా, జెఫ్ బెజోస్ సంపద 6.8 బిలియన్ డాలర్లు తగ్గింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లోని ఈ టాప్ 2 ధనవంతుల సంపద ఒక్క శుక్రవారమే 12.3 బిలియన్ డాలర్లు (రూ.96 వేల కోట్లు) పడింది. బిల్‌గేట్స్ (2.2 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (2.7 బిలియన్ డాలర్లు) , సెర్జీ బ్రిన్ (4.7 బిలియన్ డాలర్లు ) వంటి టాప్ యూఎస్ బిలియనీర్ల సంపద కూడా భారీగా తగ్గింది.
