Good News: హెచ్‌‌1బీ వీసా రూల్స్​లో మార్పులు.. లక్షలాది మంది ఇండియన్లకు ప్రయోజనం

వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే యువతకు జో బైడెన్‌‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అమెరికా కంపెనీలకు ప్రత్యేక నిపుణులైన విదేశీయులను నియమించుకోవడం కోసం నిబంధనల్లో మార్పులు చేసింది. అలాగే, ఎఫ్-1 విద్యార్థి వీసాలను ఈజీగా హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఇది అమలులోకి వస్తుంది. హెచ్-1బీ వీసా ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడం.. వేగవంతం చేయడం.. యజమానులు అగ్రస్థానంలో ఉండటానికి ఎక్కువ సౌలభ్యాన్ని అందించడం దీని లక్ష్యం.

దీనివల్ల లక్షలాదిమంది భారతీయ వృత్తి నిపుణులకు ప్రయోజనం కలగనుంది. ఇది యూఎస్ కంపెనీలు క్లిష్టమైన ఉద్యోగ ఖాళీలను మరింత సమర్థవంతంగా భర్తీ చేయడానికి వీలు కల్పిస్తుంది. హెచ్-1బీ వీసా అనేది నాన్ -ఇమిగ్రెంట్‌‌ కేటగిరీలో వస్తుంది. టెక్నాలజీ కంపెనీలు ఈ వీసా ద్వారా విదేశీ నిపుణులను నియమించుకుంటాయి.

ALSO READ : ఇండియాతో కలిసి పనిచేసేందుకు రెడీ:చైనా

ఇప్పటి వరకు భారత్‌‌, చైనా దేశాలు ఈ వీసా ద్వారా లబ్ధి పొందాయి. తాజాగా, డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ హోమ్‌‌ల్యాండ్‌‌ సెక్యూరిటీ కంపెనీలకు సౌలభ్యం కల్పించేలా నిబంధనలు మార్చింది. వీటి ప్రకారం.. సంస్థలు వాటి అవసరాలకు అనుగుణంగా నియామకాలు జరపడం ద్వారా పోటీ మార్కెట్లో స్థిరపడగలవు.