కుక్కే తన ప్రపంచం.. అది లేని జీవితం వద్దనుకున్నాడు

పెంపుడు కుక్క చనిపోతే ప్రాణాలు తీసుకోవాలా అనుకోకండి..! మనుషులతో పోలిస్తే కుక్క విశ్వాసమైన జంతువు. తన ఆకలి తీర్చే యజమాని పట్ల అదెంత ప్రేమను చూపిస్తుందో మాటల్లో వర్ణించలేం. తన అనుకున్న వాళ్లు కాసేపు కనిపించకపోతే అది పెట్టుకునే బెంగ మనుషుల్లోనూ కనిపించదు. ఇంటి నుంచి బయటకెళ్ళిన యజమాని తిరిగొకొచ్చే దాకా అది వేచి చూసే దోరణి మీరు గమినించే ఉంటారు. ఎదుటి వారు సంతోషంగా ఉన్నారా..! బాధలో ఉన్నారా..! అనే భావోద్వేగాలను అది గుర్తించగలదు. అచ్చం అలానే కుక్కతో లోతైన బంధాన్ని ఏర్పరుచుకున్న ఓ యువకుడు అది దూరమయ్యేసరికి తట్టుకోలేకపోయాడు. అది లేని ప్రపంచం తనకొద్దని ప్రాణాలే తీసుకున్నాడు.

బెంగుళూరు, హెగ్గదేవనపురానికి చెందిన 33 ఏళ్ల రాజశేఖర్ అనే యువకుడు తొమ్మిదేళ్ల క్రితం జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క పిల్లను తెచ్చుకున్నాడు. దానికి బౌన్సీ అని పేరు పెట్టుకొని ప్రాణంగా చూసుకుంటుండేవాడు. అదే అతని ప్రపంచం. తనతో పాటే తిండి.. తనతోపాటే నిద్ర. అలాంటి వీరి బంధంలో విధి చిచ్చు పెట్టింది. ఇటీవల బౌన్సీ అనారోగ్యంతో మరణించింది. దానిని సదరు యువకుడు తన వ్యవసాయ భూమిలోనే పాతి పెట్టాడు. అది చనిపోయిన నాటి నుంచి రాజశేఖర్ కుదురుగా ఉండేవాడు కాదు. ఉదయాన్నే వ్యవసాయం పొలం దగ్గరకి వెళ్లి అక్కడే సమయాన్ని గడిపేవాడు. కుటుంబసభ్యులు ఏమనేవారు కాదు. నాలుగు రోజులు అయితే మామూలు మనిషి అవుతాడుగా అనుకునేవారు.

ఇంతలో అతనికి ఏమయ్యిందో కానీ, రాజశేఖర్ ఇంట్లో శవమై కనిపించాడు. బుధవారం (జనవరి 01) ఉదయం తల్లి తలుపుకొట్టగా ఎంతసేపు డోర్ ఓపెన్ చేయలేదు. ఇరుగుపొరుగు వారి సాయంతో డోర్ బద్దలుకొట్టి చూడగా.. విగతజీవిగా పడి ఉన్నాడు. పెంపుడు కుక్క మరణం వారి కుమారున్ని తీసుకుపోయిందని సదరు యువకుడి తల్లి, అక్క రోదించిన తీరు చుట్టుపక్కల వారిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై మదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.