ఆరేండ్లైనా..పనులు పూర్తి కాలే..!..ఉప్పల్ ఆర్వోబీ పనులు డెడ్ స్లో!

  • పరకాల - -హుజూరాబాద్ రూట్ లో సమస్యగా రైల్వేగేటు
  • రూ.66 కోట్లతో 2018 లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం
  • కాంట్రాక్టర్​ ను మార్చినా ఫలితం శూన్యం
  • ప్రజలకు తప్పని తిప్పలు 

హనుమకొండ/ కమలాపూర్, వెలుగు : కరీంనగర్​-–హనుమకొండ జిల్లాలకు వారధిగా ఉన్న ఉప్పల్ రైల్వే గేటు గుండా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ, ఇక్కడ రైల్వే గేటు పడితే చాలు గంటల తరబడి వేచి చూడాల్సిందే. ఈ మార్గంలో ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 2018లోనే ఆర్వోబీ నిర్మాణానికి అడుగులు వేయగా, ఆరేండ్లయినా ఆ పనులు పూర్తి కాలేదు.

ఫలితంగా ఈ రూట్​లో ప్రయాణాలు సాగించేవారితోపాటు అంబులెన్సులు, స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్​ కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఆర్వోబీ పనులు పూర్తి చేసేందుకు స్థానిక నేతలైనా చొరవ చూపాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

రైల్వే పార్ట్​ మాత్రమే పెండింగ్..

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ నుంచి హనుమకొండ జిల్లా పరకాల వరకున్న రోడ్డును ఫోర్​ లైన్​గా విస్తరిస్తూ 2016లో సుమారు రూ.100 కోట్ల అంచనాతో పనులు చేపట్టారు. కానీ ఈ మార్గంలో కమలాపూర్​మండలం ఉప్పల్​ వద్ద రైల్వే గేట్​ఉండగా, ఇక్కడ రైళ్ల రాకపోకల సందర్భంగా తరచూ గేట్​క్లోజ్​చేస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ఉప్పల్​ గేట్​వద్ద ఆర్వోబీ నిర్మించాలనే డిమాండ్​ఎప్పటి నుంచో ఉండగా, 2018లో రూ.66 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 40 శాతం, మిగతా 60 శాతం నిధులు రాష్ట్ర సర్కారు భరించాల్సి ఉంది.

కాగా, గేటుకు ఇరువైపులా రోడ్డు నిర్మాణ పనులు చాలాకాలం కిందటే పూర్తవగా, కేవలం రైల్వే పార్ట్​ మాత్రమే మిగిలిపోయింది. కరోనా లాక్​ డౌన్​ కారణంగా ఆర్వోబీ వర్క్స్​కు బ్రేకులు పడగా, ఆ తర్వాత అంచనాలు చాలావరకు పెరిగిపోయాయి. దీంతో గత కాంట్రాక్టర్​ పనులు చేసేందుకు ముందుకు రాకపోవడంతో రీటెండర్లు నిర్వహించి, వేరే కాంట్రాక్టర్​కు వర్క్స్​అప్పగించారు. అయినా నిధుల విడుదలలో జాప్యం జరుగుతుండటంతో సదరు కాంట్రాక్టర్​కూడా పనులు నత్తనడకన సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా ఆరేండ్ల నుంచి ఉప్పల్​రైల్వే గేట్​వద్ద ఆర్వోబీకి మోక్షం కలగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఆగస్టులోనే పూర్తి చేస్తమన్నరు..

రెండు జిల్లాల వారధిగా ఉన్న ఉప్పల్​ రైల్వే గేట్ ఆర్వోబీ ఏండ్ల తరబడి పెండింగ్​లోనే ఉండడంతో జనవరిలో కరీంనగర్​ఎంపీ బండి సంజయ్​ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఆగస్టులోగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ పనులు ముందుకు సాగడం లేదు. నవంబర్​ 25న కమలాపూర్​ మార్కెట్​ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్​ తిరుగు ప్రయాణంలో ఉప్పల్ రైల్వే గేట్​వద్ద ట్రాఫిక్​లో చిక్కుకున్నారు. చాలాసేపు వేచి చూడాల్సి రావడంతో ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆర్​అండ్​బీ మినిస్టర్​ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఏండ్ల తరబడి ఆర్వోబీ పనులు ముందుకు కదలకపోవడం, నాలుగు లైన్లలో రైళ్ల రాకపోకల వల్ల ఎక్కువ సేపు వేచి ఉండాల్సి రావడంపై స్థానికులు, వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తుండగా, ఎమర్జెన్సీ వెహికల్స్​వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని ప్రజలు, వాహనదారులు డిమాండ్​ చేస్తున్నారు.