న్యూఢిల్లీ: 2021లో దేశమంతటా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) విధానం ద్వారా దాదాపు రూ.70 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వెల్లడించారు. "గత ఏడాది రికార్డుస్థాయిలో యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఇప్పుడు మనదేశంలో 50 వేలకు పైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. గత ఆరు నెలల్లో 10 వేలకు పైగా స్టార్టప్‌లు ఏర్పడ్డాయి" అని మోడీ అన్నారు. జీడీపీ రేటు 8 శాతానికి పైగా ఉందని, ఇండియాకు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. జిఎస్‌టి వసూళ్లలో పాత రికార్డులు కూడా బద్దలయ్యాయని ప్రకటించారు. ఈ సందర్భంగా, ప్రధాని దాదాపు 351 రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు (ఎఫ్పీఓలు) రూ.14 కోట్ల ఈక్విటీ గ్రాంట్‌ను విడుదల చేశారు. దీని వలన 1.24 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. 10 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.20వేల కోట్లకుపైగా బదిలీ అవుతాయని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ తెలిపింది. పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.ఆరు వేల చొప్పున అందిస్తారు. ఒక్కొక్కరికి రూ.రెండువేల చొప్పున నాలుగు -నెలలకు ఒకసారి ఇస్తారు.
