మూడేళ్లలోనే 10 కోట్ల యూజర్లు
ముంబై : అక్టోబర్ నెలలో యూపీఐ పేమెంట్స్ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) బిలియన్ మార్కును దాటేశాయి. మొదలైన మూడేళ్లలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. ఇటీవలే యూపీఐ యూజర్ల సంఖ్యా 10 కోట్లను అధిగమించింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ పేమెంట్స్ సిస్టమ్ చాలా వేగంగా ఎదిగింది. ఇండియాలో పేమెంట్స్‌లో సాధించిన ప్రగతితో ఇప్పుడు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను సింగపూర్, యూఏఈలలోనూ అందుబాటులోకి తేవాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రయత్నిస్తోంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు 2016 లో యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చారు. తమ అకౌంట్ నుంచి ఇతరుల బ్యాంకు అకౌంట్ వివరాలు ఎంటర్ చేయకుండానే డబ్బు పంపించుకునే వీలును యూపీఐ కల్పిస్తోంది.
దేశంలో డిజిటల్ పేమెంట్స్‌కు ఊపు ఇచ్చేందుకే యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశ పెట్టారు. సోషల్ మీడియా లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్‌కు 10 కోట్ల మంది యూజర్లు చేరడానికి పట్టిన టైంతో పోలిస్తే, చాలా తక్కువ టైంలోనే తాము ఈ ఘనతను సాధించగలిగామని ఎన్‌పీసీఐ సీఈఓ దిలీప్ ఆస్బె చెప్పారు. ఆగస్టు నెలలో ఇండియాలో కార్డ్ ట్రాన్సాక్షన్స్ (డెబిట్, క్రెడిట్ కలిపి) మొత్తం 142 కోట్లకు చేరాయన్నారు. వివిధ బ్యాంకులకు తమ సొంత యాప్స్ ఉన్నప్పటికీ, అవన్నీ యూపీఐతో అనుసంధానమై ఉంటాయి. ఓపెన్ ఆర్కిటెక్చర్‌తో యూపీఐని అభివృద్ధిపరచడంతో ఇది
సాధ్యమవుతోంది.
