పెబ్బేరు గోదామ్​లో అగ్నిప్రమాదంపై గప్​చుప్

  • నెలన్నర దాటినా వివరాలు వెల్లడించని ఆఫీసర్లు

వనపర్తి/పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు మార్కెట్​ యార్డు గోదామ్​లో అగ్ని ప్రమాదం జరిగి 45 రోజులు దాటుతున్నా, ఈ ఘటనకు ఎవరు బాధ్యులనే విషయాన్ని అధికారులు ఇంకా తేల్చలేదు. ఏప్రిల్​ 1న పెబ్బేరు అగ్రికల్చర్​​మార్కెట్​ యార్డు గోదామ్​లో అగ్నిప్రమాదం జరగగా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని పట్టుకోవడంలో  సివిల్​ సప్లై ఆఫీసర్లు మీనమేషాలు లెక్కించడం అనుమానాలకు తావిస్తోంది. 

గోదామ్​లో రైస్​ మిల్లర్లు నిల్వ చేసుకున్న వడ్లు, సివిల్​ సప్లై డిపార్ట్​మెంట్ కు చెందిన గోనె సంచులు ఈ ప్రమాదంలో కాలిపోయాయి. ప్రమాదంలో 23 వేల బస్తాల వడ్లు, 12.85 లక్షల గోనె సంచులు కాలిపోయినట్లు అధికారులు మొదట అంచనా వేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఘటనపై త్వరగా విచారణ పూర్తి చేసి వాస్తవాలను వెల్లడించాలని చెప్పినా, అధికార యంత్రాంగం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతోంది.  

ప్రాథమికంగా అనుమానించినా..

గోదామ్​ వెనక ఉన్న ఒక కిటీకీ ప్రమాదానికి మూడు రోజుల ముందు నుంచే తెరుచుకొని ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన రోజు అడిషనల్​ కలెక్టర్​ నాగేశ్​​దీనిని గుర్తించి అక్కడి అధికారులను ప్రశ్నించగా, గాలి కోసం హమాలీలు తెరిచి ఉంచారని సమాధానం చెప్పినట్లు తెలిసింది. దీనిని బట్టి చూస్తే  ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిందనే అనుమానాలు వచ్చాయి. 

దీనిపై నేటికీ ఎలాంటి నివేదిక రాలేదు. యాసంగిలో వడ్లు కొనుగోలు చేసేందుకు జిల్లలోని పెబ్బేరు గోదామ్​లో 12.85 లక్షలు, గోపాల్​పేటలో 25.37లక్షలు, వనపర్తి మండలం చిట్యాల గోదామ్​లో 3.20 లక్షల గన్నీ బ్యాగులను నిల్వ ఉంచారు.  పెబ్బేరు గోదామ్​ నుంచి 7 లక్షల గన్నీ బ్యాగులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడంపై అనుమానాలు వచ్చాయి. 

అంతకుముందే ఉన్నతాధికారులు గన్నీ బ్యాగులు మాయమైనట్లు గుర్తించి, బాధ్యులను హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. భారీ అగ్నిప్రమాదం జరిగిన గోదామ్​లో భద్రత విషయంలో కనీస స్థాయిలో పర్యవేక్షణ లేదని అంటున్నారు. గోదామ్​ వెనక ఖాళీ స్థలం మందు బాబులు, గంజాయి బ్యాచ్​కు అడ్డాగా మారింది. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.