జిమ్‌ ట్రైనర్‌తో వివాహేతర సంబంధం.. శవమై కనిపించిన వ్యాపారవేత్త భార్య

ఉత్తరప్రదేశ్‌: కాన్పూర్‌లో నాలుగు నెలల క్రితం కనిపించకుండా పోయిన వ్యాపారవేత్త భార్య శవమై కనిపించింది. జిమ్‌ ట్రైనర్‌తో ఆమెకున్న వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది. ఆమెను చంపాక నిందితుడు.. శవం పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ప్రభుత్వ అధికారులు నివాసముండే భవన సముదాయాల సమీపంలో పూడ్చిపెట్టాడు. దాంతో, ఈ కేసు పోలీసులకు ఒక సవాల్‌గా మారింది. 

అసలేం జరిగిందంటే..?

 కాన్పూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త భార్య వారి నివాసానికి సమీపంలో ఉన్న ఓ జిమ్‌‌కు వెళ్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకు జిమ్‌ ట్రైనర్‌ విమల్ సోనీతో పరిచయం ఏర్పడగా.. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రెండేళ్ల పాటు వీరి మధ్య ఆ సాన్నిహిత్యం బాగానే నడిచింది. ఇటీవల అతనికి పెళ్లి నిశ్చయం కాగా.. సదరు మహిళ దానిని వ్యతిరేకించింది. ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్ 24న ఇదే విషయమై మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. అతను(జిమ్ ట్రైనర్) ఆమె మెడపై కొట్టాడు. దాంతో, ఆమె స్పృహతప్పి పడిపోయింది. అదే అదునుగా ఆమెను హత్య చేసి.. శవాన్ని ప్రభుత్వ అధికారులకు కేటాయించిన బంగ్లాలు ఉన్న ప్రాంతంలో పూడ్చి పెట్టాడు. 

Also Read :- కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌజ్లో డ్రగ్స్ పార్టీపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు నెలల నుంచి మహిళ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. నిందితుడు విమల్ సోనీ మొబైల్ ఫోన్ కూడా వాడకపోవడంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులకు ఇన్ని రోజులు పట్టింది. గత ఏడాది నుంచి జిమ్‌‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనలో హత్యాచారం, హత్య వంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.