యూపీలో మొదలైన పోలింగ్

యూపీలో మొదలైన పోలింగ్

ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ మొదలయ్యింది. ఇవాళ రాష్ట్రంలో మొదటి విడతలో భాగంగా 11 జిల్లాలోని 58 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. మొదటి విడత ఓటింగ్ సందర్భంగా మథురలోని గోవర్ధన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నంబర్ 50–51 వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముజఫర్‌నగర్, కుత్బీలోని పూర్వ మాధ్యమిక కన్యా విద్యాలయంలోని పోలింగ్ బూత్ వద్ద ప్రజలు మొదటి దశలో ఓటు వేయడానికి తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు.

మరోవైపు అధికారులు సైతం జనం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ప్రజలంతా బయటకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొనాలని చెబుతున్నారు. మోడల్ పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్ బూత్‌ల వద్ద పారామిలటరీ బలగాలను మోహరించారు. వీడియోగ్రఫీ కూడా చేస్తున్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద కోవిడ్19 ప్రోటోకాల్‌లు పాటిస్తున్నామని తెలిపారు. మరోవైపు యూపీలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి అధికారులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. 

పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు ఉదయం నుంచి పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. CAPF యొక్క 129 కంపెనీ ఫోర్స్ అన్ని బూత్‌ల వద్ద మోహరించింది. EC మార్గదర్శకాల ప్రకారం సివిల్ పోలీస్, హోంగార్డ్ జవాన్లు కూడా మోహరించారని ఆగ్రా సిటీ ఎస్పీ వికాష్ కుమార్ తెలిపారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా పలువురు బీజేపీ నేతలు గోవర్ధన్ ఆలయంలో ప్రార్థనలు నిర్వహించారు.