కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తూ సెప్టెంబర్‌లో ప్రకటించిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు నవంబర్ 30 వరకూ కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు 50 శాతం సీట్లతో అనుమతించడంతో సహా అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు నవంబర్ 30 వరకూ అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా ముప్పు ఇంకా ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలు కఠినతరం చేయాలని చెప్పింది.
కరోనాపై పోరాటమే లక్ష్యంగా ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘జన్ ఆందోళన్’ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని హోంశాఖ విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు మాస్క్‌లు ధరించడం, చేతులు తరచూ శుభ్రపరుచుకోవడం, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం వంటివి ప్రతిఒక్కరూ అమలు చేయాలని కోరింది. ఈ మూడు పాటించేందుకు అవసరమైన ప్రచారం కల్పించాలని, క్షేత్ర స్థాయి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేపట్టాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
అన్‌లాక్ 5 గైడ్‌లైన్స్:
..అక్టోబర్ 15 నుంచే కంటైన్మెంట్ జోన్ల బయట సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను 50% సీటింగ్ సామర్థ్యంతో ప్రారంభించుకోవచ్చు
.. స్కూళ్లు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్ల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకొనేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు
.. పార్కులు, పబ్లిక్ ప్లేస్ లకు సంబంధించి ఇతర స్థలాలనూ తెరచుకోవచ్చు
.. బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) ఎగ్జిబిషన్లూ ప్రారంభించుకోవచ్చు
.. క్రీడాకారుల శిక్షణ కోసం ఉపయోగించే స్మిమ్మింగ్ పూల్స్ కు గ్రీన్ సిగ్నల్
..సభలు, సమావేశాల్లో 100 మందికి మించి పాల్గొనకూడదని ప్రస్తుతం ఉన్న గరిష్ఠ పరిమితి పెంచుకొనే స్వేచ్ఛనూ రాష్ట్రాలకే కేటాయింపు
.. కంటైన్మెంట్ జోన్ల బయట మరిన్ని కార్యక్రమాలకూ అనుమతి
..క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసిన తర్వాత విద్యాసంస్థల పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలి
.. ఆన్‌లైన్/దూరవిద్యా బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీలైనంతమేరకు దాన్ని ప్రోత్సహించాలి
..పాఠశాలలు తెరిచిన తర్వాతా ఆన్‌లైన్ తరగతులు కొనసాగి.. విద్యార్థులు వాటికి హాజరుకావడానికే ప్రాధాన్యం ఇస్తే వారికి అనుమతివ్వాలి
..తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలి
..హాజరును తప్పనిసరి చేయకూడదు. ఈ విషయంలో పూర్తిగా తల్లిదండ్రుల అనుమతి ప్రకారమే నడచుకోవాలి
.. కాలేజీలు, ఉన్నత విద్యాసంస్థల ప్రారంభ తేదీలపై హోంశాఖతో సంప్రదించి నిర్ణయించాలి
.. పరిశోధక విద్యార్థులను, ప్రయోగశాలతో పని ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ పీజీ విద్యార్థులను ఉన్నత విద్యాసంస్థలు అక్టోబర్ 15 నుంచి అనుమతించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాసంస్థల విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు.
.. అన్నివైపులా మూసి ఉండే సమావేశ మందిరాల్లో గరిష్ఠ సామర్థ్యంలో 50% వరకే అనుమతిస్తారు. అది కూడా 200 మందికి మించకూడదు.
.. మాస్కులు, భౌతిక దూరం, థర్మల్ స్కానింగ్ తప్పనిసరి.
.. బహిరంగ స్థలాల్లో అయితే గ్రౌండ్ వైశాల్యాన్ని దృష్టిలో ఉంచుకొని జనాన్ని అనుమతించాలి.
.. ఇలాంటి సమూహాల ద్వారా కరోనా వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు జారీ చేయాలి. వాటిని కఠినంగా అమలుచేయాలి.
.. కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా కంటైన్మెంట్ జోన్ల బయట రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించకూడదు.
.. రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో అంతర్గతంగా వ్యక్తులు, వాహనాలు, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదు.
