ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో బుద్ధుడి విగ్రహాన్ని స్థానికులు ధ్వంసం చేసిన వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఘటన పష్తూన్ ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్, మర్దాన్ జిల్లాలో శనివారం జరిగింది. ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా కూలీలు భూమిని తవ్విన టైమ్‌లో బుద్ధుడి విగ్రహం బయటపడింది. అయితే ఇస్లామిక్ బోధనలకు అనుగుణంగా లేదని సదరు విగ్రహాన్ని కూలీలు వెంటనే ధ్వంసం చేశారు.

మర్దాన్‌లోని తఖ్త్ భాయ్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం ఒకప్పటి గాంధార నాగరికతకు సంబంధించినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. సుత్తితో కూలీలు బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన పాకిస్తాన్ టూరిజం శాఖ దృష్టికి వచ్చిందని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని తాము గుర్తించామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఖైబర్ పఖ్తుంక్వా ఆర్కాలజీ అండ్ మ్యూజియం డైరెక్టర్ అబ్దుల్ సమద్ చెప్పారు.
