కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులతో కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. ఇప్పటి వరకు రైతులు –కేంద్రం మధ్య ఐదు సార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇవ్వాళ మరోసారి కేంద్రం –రైతు సంఘాల నేత మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల సమయంలో ఆసక్తిర సంఘటన జరిగింది. మధ్యాహ్నం విజ్ఞాన్ భవన్ లో రైతులు – కేంద్ర మంత్రులు భోజనం చేసేందుకు అధికారులు టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓ వైపు టేబుల్ దగ్గర రైతులు భోజనం చేస్తుంటే అదే టేబుల్ చివర భోజనం చేసేందుకు కేంద్రమంత్రులు నరేంద్ర తోమర్, పియూష్ గోయల్ వచ్చారు
అయితే చర్చలు జరిపేందుకు వచ్చిన ప్రతీ సారి రైతులకు కేంద్రం భోజనాల్ని సిద్ధం చేస్తోంది. రైతులు ఆ భోజనం తినేందుకు నిరాకరిస్తున్నారు. రైతులు వండుకొని తెచ్చుకున్న భోజనాన్ని తింటున్నారు. అయితే ఆరోసారి చర్చల సమయంలో ఓవైపు మంత్రులు, మరోవైపు రైతులు కలిసి భోజనం చేయడం ఆసక్తికరంగా మారింది.
ఈ సందర్భంగా ఓ రైతు సంఘం నాయకుడు కేంద్రమంత్రులతో మీరు మాతో భోజనం చేసేందుకు వచ్చారా అని అడగ్గా కేంద్రమంత్రులు సైలెంట్ అయ్యారు. అనంతరం రైతు నాయకులు మాట్లాడుతూ తమకు కేంద్రం తినేందుకు భోజనాన్ని సిద్ధం చేస్తుంది. కానీ మేం ఆ భోజనం చేసేందుకు సిద్ధంగా లేము. మా భోజనాన్ని మేం స్వయంగా వండుకుని తింటున్నామని రైతులు గర్వంగా చెబుతున్నారు.
అదే సమయంలో రైతులతో చర్చలు జరుపుతున్న ముగ్గురు కేంద్ర మంత్రుల బృందంలో సభ్యుడిగా ఉన్న కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ మాట్లాడుతూ కేంద్రం – రైతుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులందరూ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇళ్లల్లో న్యూఇయర్ వేడుకల్ని జరుపుకేలా నిర్ణయాత్మక మైన ప్రకటన చేస్తామని చెప్పారు.
