అబద్ధాల్లో కాంగ్రెస్​కు ఆస్కార్ ఇవ్వొచ్చు : కేంద్రమంత్రి బండి సంజయ్

  • అంబేద్కర్​ను అవమానించింది ఆ పార్టీయే
  • ఆయన ఆశయాలను అమలు చేస్తున్నది బీజేపీయే
  • దేశప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్ పేయ్ 
  • ఏడాది పాటు వాజ్​పేయ్ శతజయంతి ఉత్సవాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: అబద్ధాలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్ గోబెల్స్ ను మించి పోయిందని, అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సి వస్తే.. అది కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయనకు భారత రత్న అవార్డు ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్ అని చెప్పారు. హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో వాజ్ పేయి జయంతి సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ తదితరులు వాజ్ పేయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తర్వాత వారితో కలిసి బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన నేత అని, దేశ ప్రజలకు ఆయన స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో వాజ్ పేయ్ నడిచారని, అడుగుజాడల్లో ఆయన ఆశయాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ అని వెల్లడించారు.  రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ ప్రజలకు 70 ఎంఎం సినిమాలు, గ్రాఫిక్స్ చూపుతూ మోసం చేస్తోందే తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. అంబేద్కర్ పంచ్ తీర్థ్ ను ఏర్పాటు చేసి ఆయన ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పి, ఆయనకు భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు.

వాజ్​పేయ్​ దేశానికి ఆదర్శం

బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వాజ్ పేయ్ శతాబ్ది ఉత్సవాలను వచ్చే ఏడాది డిసెంబర్ 25 వరకూ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆయన జీవితం దేశానికే ఆదర్శమని, నవ యువ సామ్రాట్ గా ఆయన పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో వాజ్ పేయ్ 18 నెలల పాటు జైలులో ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదన్నారు. 

అంబేద్కర్ గురించి, ప్రజాస్వామ్యం గురించి బీజేపీకి కాంగ్రెస్ సర్టిఫికెట్ అక్కర్లేదని వెల్లడించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. వాజ్ పేయ్ శతజయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ సేవా కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. వాజ్ పేయ్ మూడు సార్లు ప్రధానిగా దేశానికి సేవలు చేశారన్నరు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ పాల్గొన్నారు.

బీజేపీ ర్యాలీ..

వాజ్​పేయ్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్​లో బీజేపీ ర్యాలీ నిర్వహించింది. లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి కిషన్ రెడ్డి ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తర్వాత అక్కడి నుంచి లోయర్ ట్యాంక్ బండ్ నుంచి బీజేపీ ఆఫీసు వరకూ ర్యాలీ నిర్వహించారు.