న్యూఢిల్లీ: కరోనా సోకినోళ్లందరూ టీబీ టెస్టు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అలాగే టీబీ బాధితులందరూ కరోనా టెస్టు చేయించుకోవాలంది. ఈ మేరకు శనివారం గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. టీబీ కేసులు సడెన్గా పెరిగాయని, కరోనా సోకినోళ్లకు ఆ వ్యాధి వస్తోందని మీడియాలో వార్తలు వస్తున్న క్రమంలో ఆరోగ్య శాఖ స్పందించింది. అయితే కరోనా వల్లనే టీబీ కేసులు పెరుగుతున్నాయని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని స్పష్టం చేసింది. టీబీ, కరోనా కేసులను గుర్తించేందుకు ఆగస్టులోగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ‘‘టీబీ–కరోనా, కరోనా–సారి (ఊపిరితిత్తుల వ్యాధి) డిసీజ్లకు సంబంధించి బై డైరెక్షనల్ స్ర్కీనింగ్ నిర్వహించడంపై రాష్ట్రాలు, యూటీలకు గైడ్ లైన్స్ ఇచ్చాం. వాటిని అవి అమలు చేస్తున్నాయి” అని పేర్కొంది. కరోనా కారణంగా విధించిన ఆంక్షలతో 2020లో టీబీ కేసులు 25 శాతం తగ్గాయని తెలిపింది.
రెండూ అంటువ్యాధులే..
కరోనా, టీబీ రెండూ కూడా అంటువ్యాధులేనని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇవి రెండు కూడా మొదట ఊపితిత్తులనే అటాక్ చేస్తాయని చెప్పింది. రెండు వ్యాధుల్లోనూ దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి ఒకే రకమైన లక్షణాలు ఉంటాయని పేర్కొంది. కరోనా సోకినోళ్లలో ఇమ్యూనిటీ తగ్గిపోతుందని, అలాంటి టైమ్ లో టీబీ, బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా నుంచి కోలుకున్నోళ్లు ఇమ్యూనిటీ పెంచుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
