మందుల తయారీకి టానిక్

మందుల తయారీకి టానిక్

న్యూఢిల్లీ: పొరుగు దేశం చైనాపై ఆధారపడకుండా మన దేశంలోనే పూర్తి స్థాయిలో డ్రగ్స్ తయారు చేసేలా ఫార్మా కంపెనీలను ఎంకరేజ్ చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. డ్రాగన్ దేశం నుంచి యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐల) వంటి ముడిపదార్థాల కొనుగోలును సాధ్యమైనంతగా తగ్గించడానికి ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇందు కోసం దేశ వ్యాప్తంగా మూడు చోట్ల బల్క్ డ్రగ్ పార్కులను, నాలుగు ప్రాంతాల్లో మెడికల్ డివైజ్ పార్కులను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ ఈ విషయాన్ని వెల్లడించారు. తమ రాష్ట్రంలోని భటిండాలోని బల్క్ డ్రగ్ పార్క్ను ఏర్పాటు చేయాలని ఇది వరకే పంజాబ్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలతో చేతులు కలిపి బల్క్ డ్రగ్ పార్కులను నిర్మించాలని ఈ ఏడాది మార్చిలోనే కేబినెట్ తీర్మానించింది. వీటిలో సాల్వెంట్ రికవరీ ప్లాంట్, డిస్టిలేషన్ ప్లాంట్, పవర్ స్టీమ్ యూనిట్స్, వ్యర్థాలను శుభ్రపరిచే ప్లాంటు వంటివి ఉంటాయి. ఒక్కో పార్కు నిర్మాణానికి కేంద్రం రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్ల వరకు అందిస్తుంది. ఈ పార్కుల ఏర్పాటు కోసం రాబోయే ఎనిమిదేళ్లలో మొత్తం రూ.6,940 కోట్లు ఖర్చు చేస్తారు. పీఎల్ఐగా పిలిచే ఈ స్కీమ్ ద్వారా ఫార్మా కంపెనీలకూ ఆర్థిక సాయం అందుతుంది. ఫలితంగా కీలకమైన 53 డ్రగ్ల తయారీకి అవసరమైన ఏపీఐలనూ మన దేశంలోనే తయారు చేయడం సాధ్యమవుతుంది. ఫర్మంటేషన్ ఆధారిత ఎరిత్రోమైసిన్ వంటివి తయారు చేస్తే సేల్స్ పై 20 శాతం ఇన్సెంటివ్ ఇస్తారు. కెమికల్ సింథసిస్ ఆధారంగా తయారు చేసే పారాసిటామల్ వంటివి ప్రొడ్యూస్ చేస్తే 10 శాతం ఇన్సెంటివ్ ఆరేళ్లపాటు ఇస్తారు. పీఎల్ఐ స్కీమ్ అమలు వల్ల మనదేశంలో రూ.46,400 కోట్ల విలువైన బల్క్ డ్రగ్స్ తయారవుతాయని అంచనా. ఫలితంగా చాలా మందికి జాబ్స్ కూడా వస్తాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. కరోనా కారణంగా చైనా నుంచి ఏపీఐలు సరిగ్గా రాకపోవడంతో మందుల తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. దీనికితోడు సరిహద్దుల్లో ఇండియా సైనికులతో ఇటీవల చైనా సైనికులు ఘర్షణపడటంతో, ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇంకా దెబ్బతిన్నాయి. చైనా ప్రొడక్టుల దిగుమతులను తగ్గించుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.