ఉదగమండలం (తమిళనాడు): మనతో రెండు యుద్ధాలు ఓడిపోయిన మన పక్క దేశం మనపై దొంగ యుద్ధం చేస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు. టెర్రరిజం వాళ్ల జాతీయ విధానంలో ఓ భాగమైందని మండిపడ్డారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ సక్సెస్‌ఫుల్‌గా అమలవుతోందంటే దానికి కారణం మన బలమేనన్నారు. 2016లో జరిగిన దాడులు మనం ప్రతిస్పందించే తీరును మార్చాయని, రక్షణాత్మక విధానాన్ని వీడి వేగంగా ప్రతి స్పందిస్తున్నామని వివరించారు. తమిళనాడు వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇండియా, చైనా సరిహద్దులో గొడవ జరిగినప్పుడు మన సైనికులు తెలివిగా వ్యవహరించారని పొగిడారు. ఎలాంటి పరిస్థితులనైనా, ఎప్పుడైనా మన బలగాలు బలంగా ఎదుర్కొంటాయని రుజువు చేశారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
వ్యూహాలు మార్చుకుంటున్నాం
అఫ్గాన్‌లో మార్పులు ఇండియాకు సవాలేనని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వ్యూహాలు మార్చకోవాల్సి ఉందని, అందుకు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నామని చెప్పారు. కొత్త వ్యూహాల ప్రకారం క్వాడ్‌లో మార్పులు జరిగాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నామని చెప్పారు. ఈ గ్రూప్‌లు వేగంగా నిర్ణయాలు తీసుకుంటాయని, ఇంటిగ్రేటెడ్ ఫైటింగ్ యూనిట్లను కూడా పెంచుతాయని అన్నారు.
