- సౌర విద్యుత్ ఇచ్చేందుకు ఎన్ఎల్సీ- గ్రీన్ సిగ్నల్: కిషన్ రెడ్డి
- రూ.1,214 కోట్లతో గుజరాత్లో విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం
- వచ్చే ఏడాది జూన్ నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
- ప్రాజెక్టుతో రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు ఆదా అవుతుందని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ అవసరాలకు మరో 200 మెగావాట్ల విద్యుత్ సమకూరనుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు సౌర విద్యుత్ అందించేందుకు నేవేలీ లిగ్నెట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎల్సీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ) పథకంలో భాగంగా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ స్కీమ్‌కు లోబడి ఎన్ఎల్సీ సంస్థ 510 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని గుజరాత్ లోని కచ్ జిల్లా బిబర్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు.
సోలార్ విద్యుత్ కు అవసరమైన భూమి, అనుకూలమైన వాతావరణం కచ్ లో ఉండడంతో అక్కడ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిందన్నారు. రూ.1,214 కోట్లతో నిర్మిస్తున్న ఈ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం పనులు చివరిదశకు చేరాయని, వచ్చే ఏడాది జూన్ నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్ తెలంగాణ విద్యుత్ అవసరాలు తీర్చడంలో కీలకంగా మారనుందని తెలిపారు. సోలార్ ప్రాజెక్టు ద్వారా రూ.2.57/కిలోవాట్ అవర్ కే విద్యుత్ అందుబాటులోకి వస్తుందదని, తద్వారా వచ్చే 25 ఏండ్లలో దాదాపు రూ.2 వేల కోట్లు తెలంగాణ ట్రాన్స్‌కోకు ఆదా కానుందని ఆయన వెల్లడించారు.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచి.. గృహ, పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో మరో 2,400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణలో సోలార్ ప్యానళ్ల ఉత్పత్తికి బాటలు
ఈ సోలార్ ప్యానెళ్లతో పాటు సంబంధిత పరికరాలను తెలంగాణ మార్కెట్ నుంచే కొనుగోలు చేస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణలో సోలార్ ప్యానళ్ల ఉత్పత్తికి బాటలు పడనున్నాయని చెప్పారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు.