వచ్చే సమావేశాల్లోనే బిల్లు.. మార్చి వరకు ఫ్రీ రేషన్​

వచ్చే సమావేశాల్లోనే బిల్లు..  మార్చి వరకు ఫ్రీ రేషన్​

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిరుడు తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రూపొందించిన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేబినెట్ ‘ఫార్మ్ లాస్ రిపీల్ బిల్‌‌‌‌, 2021’కు ఆమోదం తెలిపిందని సమావేశం తర్వాత కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. అగ్రి చట్టాలను రద్దు చేసేందుకు కావల్సిన ఫార్మాలిటీస్​ను కేబినెట్ పూర్తి చేసిందని తెలిపారు. ‘‘వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెడతాం. ఈ 3 చట్టాల రద్దుకే ప్రభుత్వం ప్రయారిటీ ఇస్తోంది” అని ఆయన చెప్పారు.  పార్లమెంట్ వింటర్ సెషన్ సమావేశాలు ఈ నెల 29నుంచి స్టార్ట్ అయి, డిసెంబర్ 23 వరకు కొనసాగుతాయి. అగ్రిచట్టాల రద్దు బిల్లుతో పాటు క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిల్లు, మరో 24 బిల్లులు ఈ సమావేశాల్లో సభ ముందుకు రానున్నాయి.  

ఫైనల్ కాని ‘క్రిప్టో’ బిల్లు
దేశంలో క్రిప్టో కరెన్సీపై బ్యాన్ విధించేందుకు లేదా కంట్రోల్ చేసేందుకు కేంద్రం తీసుకురానున్న బిల్లు ఇంకా ఫైనలైజ్ కాలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్రిప్టో కరెన్సీని పూర్తిగా బ్యాన్ చేయడం కాకుండా, తక్కువ మొత్తంలో మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం అనుమతించనున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. లీగల్ టెండర్ గా ఉపయోగించకుండా నిషేధం విధించే అవకాశం ఉందంటున్నారు. అయితే క్రిప్టో కరెన్సీని పూర్తిగా బ్యాన్ చేయాలని, దీనిని అనుమతిస్తే దేశంలో ఆర్థిక అస్థిరత్వం ఏర్పడుతుందని ఆర్బీఐ ఇదివరకే చెప్పింది.

80 కోట్ల మందికి లబ్ధి..
ప్రధాన మంత్రి గరీబ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) కింద రేషన్ కార్డుదారు లకు ప్రతినెలా 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకూ పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుం ది. మరో 4 నెలలు పథకాన్ని పొడిగిం చామని, మొత్తం 80 కోట్ల మందికి లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. పథకం పొడిగింపు తో కేంద్రంపై అదనంగా రూ.53,344 కోట్ల భారం పడనుందని తెలిపారు. కరోనా విపత్తు సమయంలో పేదలను ఆదుకునేందుకు గాను కేంద్రం నిరుడు మార్చిలో పీఎంజీకేఏవై స్కీం కింద నార్మల్ కోటాకు అదనంగా నెలకు 5 కిలోల ఫ్రీ రేషన్ ను ప్రకటించింది.