న్యూఢిల్లీ : అమెరికా మల్టీ నేషనల్ కంపెనీ యూనిలీవర్ తయారు చేసిన కొన్ని ప్రొడక్టుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నాయని తేలడంతో కంపెనీ అలెర్టయింది. సంబంధిత బ్యాచ్‌ల ప్రొడక్టులను వెనక్కి తెప్పిస్తోంది. ఈ రీకాల్ 2021 అక్టోబర్ ముందు తయారు చేసిన ఉత్పత్తులకు వర్తిస్తుందని యూనిలీవర్ తెలిపింది. క్యాన్సర్‌కు కారణమయ్యే బెంజీన్ అనే రసాయనంతో కలుషితమయ్యాయని గుర్తించిన తర్వాత, డవ్‌తో సహా మరికొన్ని బ్రాండ్‌ల ఏరోసోల్ డ్రై షాంపూలను రీకాల్ చేసింది. కంపెనీ శుక్రవారం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన నోటీసు ప్రకారం, నెక్సస్, సావ్, ట్రస్మీ, టిగి వంటి బ్రాండ్‌ల ప్రొడక్టులను కూడా వెనక్కి తెప్పిస్తున్నది. రాక్హాలిక్, బెడ్ హెడ్ డ్రై షాంపూలు దుకాణాల నుంచి వెనక్కి వస్తున్నాయి. యూనిలీవర్ నిర్ణయంపై అమెరికాలో పెద్ద ఎత్తున చర్చ మొదలయింది. కాస్మొటిక్స్ తయారీలో వాడుతున్న రసాయనాలపై ఆందోళన ఎక్కువయింది. పర్సనల్ కేర్ ఉత్పత్తులలో ఏరోసోల్‌ల భద్రత గురించి మరోసారి ప్రశ్నలు వస్తున్నాయి. గత ఏడాదిన్నర కాలంలో జాన్సన్ & జాన్సన్స్, న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కంపెనీ బనానా బోట్, బెయర్‌స్ డోర్ఫ్ ఏజీకి చెందిన కాపర్‌టోన్ వంటి అనేక ఏరోసోల్ సన్‌స్క్రీన్‌లను షెల్ఫ్‌ల నుంచి తొలగించారు. ప్రోక్టర్ & గ్యాంబిల్ కంపెనీ స్ప్రే- ఆన్ యాంటీపెర్స్పిరెంట్‌లు సీక్రెట్, అండ్ ఓల్డ్ స్పైస్‌తో పాటు యూనిలివర్స్ సువేవ్ను రీకాల్ చేశారు.
గుర్తించిన వాలిషూర్ ల్యాబ్
పోయిన ఏడాది మేలో కనెక్టికట్‌లోని న్యూ హెవెన్‌లో ఉన్న వాలిషూర్ అనే ఎనలిటికల్ ల్యాబ్ ఈ ప్రొడక్టుల్లో బెంజీన్ కనుగొనడంతో రీకాల్‌లు మొదలయ్యాయి. స్ప్రే- ఆన్ డ్రై షాంపూ సమస్యగా మారడం ఇదే మొదటిసారి కాదు. వాలిషూర్ పరిశోధనల ఫలితాల తరువాత ప్రోక్టర్ అండ్ గ్యాంబిల్ తమ ఉత్పత్తుల మొత్తం పోర్ట్‌ఫోలియోను పరీక్షించింది. బెంజీన్ కాలుష్యం ఉందని ఒప్పుకుంటూ పేర్కొంటూ డిసెంబర్‌లో కంపెనీ తన పాంటీన్ అండ్ హెర్బల్ ఎసెన్సెస్ డ్రై షాంపూలను రీకాల్ చేసింది. ఏరోసోల్ డ్రై షాంపూల వంటి ప్రొడక్టులు బెంజీన్ కాలుష్యం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయని, తాము ఇట్లాంటి ప్రొడక్టులను తరచూ పరిశీలిస్తున్నామని వాలిషూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ లైట్ చెప్పారు. క్యాన్లలోఅమ్మే డియోడరెంట్లు వంటి ప్రొపెల్లెంట్లలో ఏరోసోల్స్ సమస్య ఎక్కువగా ఉంటోంది. వీటిని స్ప్రే చేయాల్సి ఉంటుంది. తన డ్రై షాంపూ రీకాల్ విషయంలో ఇదే జరిగిందని యూనిలీవర్ తెలిపింది. ఉత్పత్తులలో ఎంత బెంజీన్ ఉందో కంపెనీ వెల్లడించలేదు. అయినప్పటికీ వాటిని చాలా జాగ్రత్తగా రీకాల్ చేస్తున్నట్లు మాత్రమే తెలిపింది. రీకాల్ చేసిన ప్రొడక్టుల్లో ఉన్న స్థాయిలో బెంజీన్ వాడటం వల్ల తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్లు ఏమీ కలగవని ఎఫ్‌డీఏ పేర్కొంది. అయినప్పటికీ బెంజీన్ వల్ల లుకేమియా, రక్త క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు ఉంటాయని వెల్లడించింది. డ్రై షాంపూల వంటి స్ప్రే ఆన్ పర్సనల్ కేర్ ఉత్పత్తుల్లో ప్రొపేన్, బ్యూటేన్ వంటి ప్రొపెల్లెంట్లు ఉంటాయి. ముడి చమురును శుద్ధి చేశాక వచ్చే పెట్రోలియం డిస్టిలేట్ వీటిలో ఉంటుంది. బెంజీన్ అనేది పెట్రోలియం ఉత్పత్తులలో ఉంటుంది. ప్రొపెల్లెంట్‌లు బెంజీన్ కాలుష్యానికి మూలమని ఎఫ్‌డీఏ నిర్ధారించింది. ఎఫ్‌డీఏ డ్రై షాంపూ వంటి ప్రొడక్టుల కోసం బెంజీన్ పరిమితి ఎంత ఉండాలో నిర్ధారించనప్పటికీ, ఉత్పత్తులలో "విషపూరితమైన లేదా హానికరమైన పదార్ధం" ఉండకూడదని స్పష్టం చేసింది.
