విలక్షణమైన సాంస్కృతిక, భౌతిక ప్రాముఖ్యత ప్రదేశాలు..వరల్డ్​హెరిటేజ్ సైట్స్

విలక్షణమైన సాంస్కృతిక లేదా భౌతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తుంది. చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాల గురించి అవగాహన కల్పించడంతోపాటు వాటి రక్షణ, విశిష్టతను తెలియజేయడమే దీని ఉద్దేశం. సాంస్కృతిక, సహజ, మిశ్రమ కట్టడాలకు యునెస్కో గుర్తింపు ఇస్తుంది. 

దేశంలో ఇప్పటివరకు 42 ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇటీవల సాంస్కృతిక క్యాటగిరీలో సింధూ నగరమైన ధోలవీరా, కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయాన్ని గుర్తించింది.  దేశంలో 42 వారసత్వ కట్టడాల్లో సాంస్కృతిక 34, సహజ 7, మిశ్రమ సంపద ఒకటి ఉన్నాయి. దేశంలో మొదటిసారిగా 1983లో ఆగ్రా కోట, ఎల్లోరా గుహలు, తాజ్​మహల్​కు ఈ హోదా లభించింది. పోటీ పరీక్షల దృష్ట్యా వీటిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. 

మిశ్రమ ప్రదేశం

సహజ, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగి ఉన్న వారసత్వ సంపదగా యునెస్కో సిక్కిం రాష్ట్రంలోని కాంచన్​జంగ జాతీయ పార్కును 2016లో గుర్తించింది. 

సాంస్కృతిక ప్రదేశాలు 

పెయింటింగ్​లు, స్మారక చిహ్నాలు, వాస్తుశిల్పం తదితర ప్రత్యేక సాంస్కృతిక లక్షణాలను కలిగి ఉన్న ప్రదేశాలను యునెస్కో సాంస్కృతిక ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తిస్తుంది. అవి.. తాజ్​మహల్​(యూపీ 1983), ఎల్లోరా గుహలు (మహారాష్ట్ర, 1983), అజంతా గుహలు(మహారాష్ట్ర, 1983), ఆగ్రా ఫోర్ట్​ (యూపీ, 1983), సూర్యదేవాలయం(కోణార్క్​, 1984), మహాబలిపురంలోని స్మారక కట్టడాలు(తమిళనాడు​, 1984), ఖజురహో(మధ్యప్రదేశ్, 1986), హంపి(కర్ణాటక, 1986), ఫతేపూర్​ సిక్రి(యూపీ​, 1986), గోవా చర్చిలు– కాన్వెంట్లు(1986), పట్టడకల్(కర్ణాటక, 1987), చోళుల ఆలయాలు(తమిళనాడు, 1987).

 ఎలిఫెంటా గుహలు (మహారాష్ట్ర, 1987), సాంచీలో బౌద్ధ కట్టడాలు(మధ్యప్రదేశ్​, 1989), కుతుబ్ మీనార్(ఢిల్లీ, 1993), హుమాయూన్​ టుంబ్స్​(ఢిల్లీ, 1993), మౌంటైన్​ రైల్వేస్​ ఆఫ్​ ఇండియా(తమిళనాడు, 1999), బోధ గయలోని మహాబోధి ఆలయం (బీహార్​, 2002), భీంబెట్కాలోని రాతి గుహలు(మధ్యప్రదేశ్​, 2003), ఛత్రపతి శివాజీ టెర్మినల్(మహారాష్ట్ర, 2004), చాంపానేర్​– పావగఢ్​ ఆర్కియాలజికల్​ పార్క్(గుజరాత్​, 2004)​.

ఎర్రకోట(ఢిల్లీ, 2009), జంతర్​ మంతర్(రాజస్తాన్​, 2010)​, రాణి కి– వావ్(గుజరాత్​, 2014)​, నలంద విశ్వవిద్యాలయంలోని పురావస్తు ప్రదేశం(బిహార్​, 2016), జైపూర్​ సిటీ(రాజస్తాన్​, 2020), అహ్మదాబాద్​ చారిత్రక నగరం(గుజరాత్​, 2017), విక్టోరియన్​ అండ్​ ఆర్ట్​ డెకో ఎసాంబిల్​ ఆఫ్​ ముంబయి(2018), లే కార్బుసియర్​ ఆర్కిటెక్చరల్​ వర్క్(ఛత్తీస్​గఢ్​, 2016)​, కాకతీయ రుద్రేశ్వరాలయం(తెలంగాణ, 2021, జులై 25), ధోలవీరా(గుజరాత్​, 2021, జులై 27).  

రామప్ప దేవాలయం: వరంగల్​ జిల్లా వెంకటాపూర్​ మండలం పాలంపేట ప్రాంతంలో రామప్ప దేవాలయం ఉంది. ఆలయ నిర్మాత రేచర్ల రుద్రుడు. నీటిపై తేలే ఇటుకలతో నిర్మించడం ప్రత్యేకత. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు రుద్రేశ్వరస్వామి. ఆలయ నాసికలో వివిధ భంగిమల్లో ఉన్న స్త్రీమూర్తులు ప్రత్యేక ఆకర్షణ. రామప్ప దేవాలయం వాస్తుశైలి బేలూరులోని హోయసాల చెన్నకేశవాలయాన్ని పోలి ఉంది. పేరిణీ నృత్య విధానంలోని నృత్యరీతులు రామప్ప ఆలయంపై చిత్రించబడ్డాయి. ఈ నృత్య సృష్టికర్త జయపసేనాని.

ధోలవీరా: గుజరాత్​ రాష్ట్రం గ్రేట్​ రాన్​ ఆఫ్​ కచ్​ ద్వీపంలో ధోలవీరా ఉంది. ఈ సింధూ నగరాన్ని 1991లో కనుగొన్నారు. ఇక్కడ జేపీ జోషి, ఆర్​.ఎస్.బిస్త్​ తవ్వకాలు జరిపారు. మిగిలిన సింధూ నగరాల వలె కాకుండా మూడు భాగాలుగా విభజించబడింది. అవి.. 1. కోట 2. మధ్య పట్టణం 3. దిగువ పట్టణం. ఈ మూడు భాగాలు ఆర్థిక వ్యత్యాసాలు చూపిస్తాయి. ధోలవీరాలో స్టేడియం నిర్మాణం బయటపడింది. సింధూ నాగరికత అతి పెద్ద లిపిని (అక్షరాల సంఖ్య రీత్యా) ధోలవీరా మనకు అందజేసింది. 

కుతుబ్​మీనార్: భారత భూభాగంపై ఇస్లాం విజయానికి చిహ్నంగా కుతుబ్​ మినార్​ను కుతుబుద్దీన్​ ఐబక్​ నిర్మించతలపెట్టాడు. ఇది కువ్వత్​ ఉల్​ ఇస్లాంను పోలి ఉంటుంది. ఎత్తు 225 అడుగులు, నాలుగంతస్తులు. మొదటి అంతస్తులో కొంత భాగం మాత్రమే ఐబక్​ నిర్మించాడు. మిగిలిన భాగాన్ని, అంతస్తులను ఇల్​టుట్​మిష్​ పూర్తి చేశాడు. ఫిరోజ్​ షా కాలంలో పిడుగు పడటం వల్ల నాలుగో అంతస్తు ధ్వంసం కాగా దాన్ని పూర్తిగా తొలగించి దాని స్థానంలో రెండంతస్తులు నిర్మించాడు. ఫలితంగా ఎత్తు 234 అడుగులకు చేరింది.   

ఫతేపూర్​ సిక్రీ: ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రాలో ఫతేపూర్​ సిక్రీ ఉంది. దీని మొదటి పేరు ఫతేహాబాద్. షేక్​ సలీం చిష్టీ గౌరవ సూచకంగా ఫతేపూర్​ సిక్రీని మొగల్​ చక్రవర్తి అక్బర్​ నిర్మించాడు. ఫతేపూర్​ సిక్రీ కోటలో నౌబత్​ఖానా భవనం(సంగీత భవనం), ఇబాదత్​ ఖానా (ప్రార్థన మందిరం), జోధా భవనం (బంగారంతో తాపడం చేసిన ఏకైక కట్టడం) పంచమహాల్​ (బౌద్ధ లక్షణాలతో నిర్మాణం) మొదలైన నిర్మాణాలు ఉండేవి. 

ఆగ్రాకోట: అక్బర్ స్వీయ పర్యవేక్షణలో ఆగ్రాకోట నిర్మించారు. దీనికి 2 ద్వారాలున్నాయి. అవి..1. ఢిల్లీ దర్వాజా (ఏడును దర్వాజా) 2. అమర్​సింగ్​ దర్వాజా. ఆర్చీలు లేకుండా భీం, బ్రాకెట్​ పద్ధతిలో నిర్మించబడింది. ఇది గ్వాలియర్​ కోటను పోలి ఉంటుంది. 

ఎర్రకోట: 1639–48 మధ్యకాలంలో షాజహాన్​ ఎర్రకోటను నిర్మించాడు. దీని అసలు పేరు షాజహానాబాద్​. ఆగ్రాకోటలో నీటి వసతి సరిగా లేకపోవడంతో ఢిల్లీలో ఎర్రకోటను షాజహాన్​ నిర్మించాడు. ఈ కోట శిల్పి హమీద్​. 1648లో ఎర్రకోట గోడలను ఎర్ర ఇసుక రాయితో ప్రతిష్టించడం వల్ల దీన్ని ఎర్రకోట అంటారు. ఎర్రకోటలోని నిర్మాణాలు 1. దివాన్​ ఇ ఆమ్​ 2. దివాన్​ ఇ ఖాస్​ 3. మోతీమహల్​ 4. నౌబత్​ ఖానా 5. రంగా మహల్​. 

బార్హూత్​, సాంచీ స్తూపాలు : మధ్యప్రదేశ్​లో శుంగుల కాలంలో అభివృద్ధి చెందిన స్తూపం బార్హూత్​. ఈ స్తూపంపై అజాత శత్రువు బౌద్ధ మతాన్ని స్వీకరించిన చిత్రం చిత్రీకరించారు. దేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం సాంచీ. ఈ స్తూపాన్ని  మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో  అశోకుడు నిర్మించాడు. ఇది ఇటుకలతో నిర్మితమైంది.  

మహాబలిపురం:మహాబలిపురంలోని పంచపాండవ రథాలు, గంగావతరణ శిల్పం మొదలైనవి నరసింహవర్మ కాలానికి చెందిన నిర్మాణాలు. మహాబలిపురంలోని ధర్మరాజ, భీమ, అర్జున, ద్రౌపది, సహదేవ రథాలను పాండవుల రథాలంటారు. ఇవి ఏక శిలా రథాలు. అర్జున రథం సమీపంలో ఒకే అధిష్టానంపై ద్రౌపది రథం కూడా నిర్మించారు. ఇవి పూర్తిగా గుడిసె ఆకారపు కప్పుతో ద్రావిడ విమాన భాగాల్లో ముఖ్యమైన దేవకోష్టాన్ని పోలి ఉంటాయి. 

ఇవేకాక పిండారి రథాలు రెండు, గణేశ రథం, వలయ్యనికుట్టై రథం, మరో అసంపూర్తి రథాలను మహాబలిపురంలో చూడవచ్చు. మహాబలిపురంలోని 10 శిలా మండపాలు కూడా నరసింహ వర్మ కాలానికి చెందినవే. ఇవి ధర్మరాజ మండపం, వరాహ మండపం, రామానుజ మండపం, రెండు గదులు శైవ మండపం, రెండు అసంపూర్ణ మండపాలు. 

శాంతినికేతన్ గృహ​: దీనిని దేశంలో 41వ ప్రపంచ వారసత్వ సంపదగా ఇటీవల యునెస్కో గుర్తించింది. శాంతినికేతన్​ను దేవేంద్రనాథ్​ ఠాగూర్​ స్థాపించగా, దాని అభివృద్ధిలో రవీంద్రనాథ్​ ఠాగూర్​, సురేంద్రనాథ్​ కౌర్, నందలాల్​ బోస్​, పాట్రిక్​, ఆర్థర్​ గెడ్డెస్​ కీలక పాత్ర పోషించారు. పశ్చిమబెంగాల్​ రాష్ట్రంలో యునెస్కో గుర్తించిన మూడో  వారసత్వ సంపద శాంతినికేతన్​ గృహ. గతంలో సుందర్​బన్​ నేషనల్​ పార్క్​, డార్జిలింగ్​ మౌంటై రైల్వేలను ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. 

హోయసాల టెంపుల్​ కాంప్లెక్స్​: కర్ణాటక రాష్ట్రంలోని హోయసాల టెంపుల్​ కాంప్లెక్స్​ను 42వ ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఇందులో చెన్నకేశవ ఆలయం(బేలూర్​), హోయసాలేశ్వర ఆలయం(హాలేబిదు), కేశవ ఆలయం(సోమనాథపూర్​) ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో యునెస్కో గుర్తించిన నాలుగో వారసత్వ సంపద హోయసాల ఆలయాలు. గతంలో హంపి, పట్టడకల్​, పశ్చిమ కనుమలను యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చింది.