ఉత్తరాఖండ్ సీఎం ఎవరు ?

ఉత్తరాఖండ్ సీఎం ఎవరు ?
  •     ఉత్తరాఖండ్ సీఎం ఎవరు?
  •     సీఎం ధామి ఓటమితో పార్టీలో సందిగ్ధం
  •     కొత్త సీఎం రేసులో సత్పాల్ మహరాజ్, ధన్ సింగ్ రావత్  
  •     చన్నీ, యోగి, బీరేన్ సింగ్ కూడా రాజీనామా 
  •     పంజాబ్ సీఎంగా 16న భగవంత్ మన్ ప్రమాణం  
  •     యూపీలో యోగి, గోవాలో సావంత్ కే మళ్లీ చాన్స్?   

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓడిపోవడంతో ఆయనను మళ్లీ సీఎంగా నియమించే విషయంలో ఆ పార్టీలో డైలమా నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేయాల్నా? లేక ఎంపీల్లో ఎవరో ఒకరిని సీఎంగా నియమించాల్నా? అన్నదానిపై ఆ పార్టీ పెద్దలు తర్జనభర్జన పడుతున్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ లు అబ్జర్వర్ లుగా మీటింగ్ ఉంటుందని, అందులో సీఎం ఎంపికపై నిర్ణయం తీసుకుంటారని చెప్పినా.. దీనిపైనా పార్టీ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే, ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు డెహ్రాడూన్ లో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలతో పార్టీ జనరల్ సెక్రటరీ కైలాస్ విజయవర్గీయ అనధికారిక సమావేశం నిర్వహించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఉత్తరాఖండ్​కొత్త సీఎం రేసులో బీజేపీ ఎమ్మెల్యేలు సత్పాల్ మహారాజ్, ధన్ సింగ్ రావత్ ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.  రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ కూడా సీఎం రేసులో ఉన్నట్లు చెప్తున్నారు.  రాష్ట్ర బీజేపీ ఇన్​చార్జి జితేందర్ బగ్గా శుక్రవారం ‘ధామీ మరోసారి’ అని ట్వీట్ చేశారు. దీంతో ధామీకే సీఎంగా అవకాశం వస్తుందన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్​షాకు అత్యంత సన్నిహుతుడు, రాజ్యసభ ఎంపీ అనిల్ బలూనికే చాన్స్ వస్తుందని మరికొందరు చెప్తున్నారు. సీఎం రేసులో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రమేశ్ ఫోఖ్రియాల్ కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సర్కార్ ఏర్పాటుకు వీలుగా సీఎం ధామి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కు రిజైన్ లెటర్ అందజేశారు. 70 అసెంబ్లీ సీట్లున్న ఉత్తరాఖండ్ లో బీజేపీ 47 సీట్లలో గెలుపొందింది. ఖతిమా సీటు నుంచి పోటీ చేసిన సీఎం ధామి.. కాంగ్రెస్ క్యాండిడేట్ భువన్ చంద్ర చేతిలో 6,579 ఓట్ల తేడాతో ఓడిపోయారు.  

మణిపూర్​లో 19లోపు కొత్త సర్కార్ 
మణిపూర్​సీఎం ఎన్ బీరేన్​సింగ్​శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ లా గణేశన్​కు రాజీనామా సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఆయనకు సూచించారు. తర్వాత రాజ్​భవన్​బయట బీరేన్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19లోపు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ 31 కంటే ఎక్కువ సీట్లు సాధించినందున సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నేషనల్​పీపుల్స్​పార్టీ(ఎన్​పీపీ)తో ఈసారి పొత్తు ఉండదన్నారు. అయితే, మిత్రపక్షాలు ఇప్పుడు బయటి నుంచి మద్దతు ఇవ్వొచ్చన్నారు. ఒకటి రెండు రోజుల్లో బీజేపీ హైకమాండ్​ పంపించే సెంట్రల్ అబ్జర్వర్లు రాష్ట్రానికి వస్తారని కొత్త ప్రభుత్వం, పొత్తులపై వారే తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
16న భగవంత్ మన్ ప్రమాణం 
పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్.. అక్కడ సర్కార్ ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల16న భగవంత్ మన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమితో సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ రాజీనామా చేశారు. శుక్రవారం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు తన రిజైన్ లెటర్ అందజేశారు. అంతకుముందు వర్చువల్ గా కేటినెట్ మీటింగ్ నిర్వహించారు. అసెంబ్లీని రద్దు చేయాలని గవర్నర్ కు సిఫారసు చేశారు. ఈ ఎన్నికల్లో చన్నీ రెండు సీట్లలో పోటీ చేయగా, రెండు చోట్లా ఓడిపోయారు.

యూపీలో మళ్లీ యోగికే! 
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. లక్నోలోని రాజ్​భవన్​కు వెళ్లి గవర్నర్ ఆనందీబెన్ పటేల్​కు రిజిగ్నేషన్​ను అందజేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గ్రాండ్ విక్టరీ సాధించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా యోగి తన పదవికి రిజైన్ చేశారు. ఇంతకుముందు ఎమ్మెల్సీగా సీఎం పదవి చేపట్టిన యోగి.. తొలిసారి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తనకు పట్టున్న గోరఖ్ పూర్​ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, యూపీలో సీఎం క్యాండిడేట్ ఎవరన్నది ఇప్పటివరకు బీజేపీ పెద్దలు ప్రకటించలేదు. కానీ యోగి ఆధ్వర్యంలోనే భారీ విజయం సాధించినందున మరోసారి ఆయనకే సీఎంగా చాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు.