తల్లి మృతిని తట్టుకోలేక.. కొడుకు ఆత్మహత్య

  • సికింద్రాబాద్​ లాలాపేట వినోభానగర్​లో ఘటన 
  • ఇద్దరూ రెండ్రోజుల కిందటే మృతి 
  • దుర్వాసన రావడంతో గుర్తించిన ఇంటి ఓనర్ 

సికింద్రాబాద్, వెలుగు: తల్లి క్యాన్సర్ పేషెంట్. కొడుకు డిగ్రీ స్టూడెంట్. ఇద్దరూ ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తల్లి మందుల కోసం పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు ఆ యువకుడు. కానీ  పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయింది. తల్లి మరణాన్ని తట్టుకోలేకపోయిన యువకుడు ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. సికింద్రాబాద్ లాలాపేటలోని వినోభానగర్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. లక్ష్మి(52), అభినయ్(20) తల్లీకొడుకులు. 

వీరిద్దరూ వినోభానగర్ లోని ఓ ఇంట్లో ఎనిమిది సంవత్సరాలుగా అద్దెకు నివసిస్తున్నారు. లక్ష్మి క్యాన్సర్ బాడిన పడటంతో ఇంటి వద్దనే ఉంటోంది. అభినయ్ నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంట్లో సంపాదించే వారు ఎవరూ లేకపోవడంతో అభినయ్ ఒకవైపు డిగ్రీ క్లాసులకు హాజరవుతూనే.. ఖాళీ సమయాల్లో దొరికిన పని చేస్తూ వచ్చిన డబ్బులతో కాలేజీ ఫీజులు కడుతూ, తల్లికి మందులు కొంటూ జీవనం సాగిస్తున్నారు. 

అయితే, శనివారం మధ్యాహ్నం సమయంలో వీళ్లు ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి యజమాని బ్రహ్మాజీ వెళ్లి తలుపులు తట్టాడు. ఎంత కొట్టినా తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి లాలాగూడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. దీంతో హాల్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని అభినయ్ వేలాడుతూ కనిపించాడు. బెడ్ రూంకి వెళ్లి చూడగా లక్ష్మి కూడా మృతి చెంది ఉంది. 

రెండు రోజుల కిందటే.. 

ఇంట్లో లక్ష్మి మెడికల్ రిపోర్టులతోపాటు అభినయ్ ఇంగ్లిష్ లో రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘నాకు, మా అమ్మకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నాకు తండ్రి కూడా లేడు. మా బంధువుల కోసం వెతకవద్దు. అయామ్ సారీ..” అని అభినయ్ సూసైడ్ నోట్ రాసినట్టు పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న తల్లి చనిపోవడంతో ఆ బాధను తట్టుకోలేకనే అభినయ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నట్టు చెప్పారు. వీరు మరణించి రెండు రోజులు అయి ఉంటుందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.