న్యూయార్క్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా మానవాళిలోని 1/5వ వంతు మంది పేదరికంలోకి కూరుకుపోయే అవకాశం ఉందని యునైటెడ్ నేషన్స్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. “ఉక్రెయిన్‌లో ప్రస్తుతం ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. అయితే అది సరిహద్దులు దాటుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల మీద నిశ్శబ్ద యుద్ధాన్ని అది ప్రారంభిస్తోంది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల మంది సంక్షోభంలో చిక్కుకుంటారు. అంటే మానవాళిలో ఐదో వంతుకుపైగా జనం గతంలో ఎన్నడూ చూడనంతగా పేదరికంలోకి, ఆకలికేకల్లోకి జారిపోతారు”అని పేర్కొన్నారు.
ధరలు పెరుగుతయ్
ఉక్రెయిన్, రష్కా కలిసి ప్రపంచంలోని 30 శాతం గోధుమలు, బార్లీ ఉత్పత్తి చేస్తాయని, మొక్కజొన్న ఉత్పత్తిలో 20%, సన్‌ఫ్లవర్ ఆయిల్లో సగానికిపైగా అక్కడే పండుతుందని గుటెరస్ తెలిపారు. 40కిపైగా పేద దేశాలకు మూడోవంతు గోధుమల సరఫరా ఉక్రెయిన్, రష్యా నుంచే ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో తలెత్తిన సంక్షోభం ఆహార ధాన్యాల ఉత్పత్తిని తగ్గిస్తుందని, సరఫరా చైన్‌ను కూడా దెబ్బతీస్తుందని, దీని వల్ల ధరలు ఆకాశాన్నంటుతాయని చెప్పారు. 2022 మొదలైన తర్వాత నుంచి గోధుమలు, మొక్కజొన్న ధరలు 30 శాతానికిపైగా, బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 60 శాతానికిపైగా, గ్యాస్, ఫెర్టిలైజర్స్ ధరలు రెట్టింపునకుపైగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదవారిని మరింత పేదవారిగా మార్చే ప్రస్తుత ఆర్థిక విధానాల్లో మార్పులు రావాలని, అంతర్జాతీయంగా సంస్కరణలు వస్తేనే ఇది సాధ్యమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తలవంచేదే లేదు: ఉక్రెయిన్ ప్రధాని
మరోవైపు రష్యాతో యుద్ధంలో చివరివరకూ పోరాడతామని ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ ప్రకటించారు. మరియుపోల్‌లో రష్యా సేనలకు తలవంచేది లేదని, తుది వరకు పోరాటం చేస్తామని చెప్పారు. మరియుపోల్‌లోని ఒక స్టీల్‌ప్లాంట్ దగ్గర పోరాటం చివరి దశకు చేరిన సంగతి తెలిసిందే. స్టీల్‌ప్లాంట్ లోపల చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారని భావిస్తున్న రష్యా వారిని లొంగిపోవాలని చాలా రోజులుగా కోరుతోంది. అయితే ఉక్రెయిన్ సోల్జర్లు స్టీల్‌ప్లాంట్‌లోని టన్నెల్స్‌లో ఉండి వీరంతా పోరాటం కొనసాగిస్తుండటం రష్యాను ఇబ్బందులకు గురిచేస్తోంది. సరెండర్ కావాలె లేదా చనిపోతారన్న రష్యా బలగాల అల్టిమేటమ్‌ను.. ఉక్రెయిన్ సేనలు పట్టించుకోవడంలేదు. లొంగిపోయేందుకు ససేమీరా అంటున్నాయి. ఒకవేళ ఇక్కడ లొంగిపోతే ఏడు వారాల యుద్ధంలో ఉక్రెయిన్‌పై రష్యా అతి పెద్ద విజయం సాధించినట్టవుతుంది.
లవీవ్‌లో పేలుడు.. ఏడుగురు మృతి
ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం లవీవ్ సిటీపై రష్యా మిస్సైళ్లతో దాడులు చేసింది. పేలుళ్ల కారణంగా భారీగా మంటలు చెలరేగాయి. ఎక్కడ చుసినా పొగలు, మంటలే కనిపించాయి. ఈ దాడుల్లో ఏడుగురు చనిపోయినట్టు ఉక్రెయిన్ అధికార వర్గాలు తెలిపాయి. ఆదివారం రాత్రి నుంచి కొనసాగుతున్న దాడుల్లో ఏడుగురు చనిపోయారని, 12 మంది గాయపడ్డారని లవీవ్ మేయర్ ఆండ్రీ సడోవియ్ తెలిపారు.
