82 ఏళ్ల డయాలసిస్ పెషెంట్ కు తొలి టీకా
కరోనాను ఓడిస్తా మన్న నమ్మకం వచ్చిందన్న బ్రిటన్ ప్రధాని
లండన్: బ్రిటన్ లో ఆక్స్ ఫర్డ్/ఆస్ట్రాజెనెక్ వ్యాక్సిన్ పంపిణీ సోమవారం నుంచి స్టార్ట్ అయింది. రిటైర్డ్ మెయింటెనెన్స్ మేనేజర్, 82 ఏళ్ల డయాలసిస్ పేషెంట్ బ్రయాన్ పింకర్ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్ లో తొలి వ్యాక్సిన్ వేయించుకున్నాడు. కరోనా వైరస్ టీకా వేయించుకోవడంపై పింకర్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ వ్యాక్సిన్ ను ఆక్స్ ఫర్డ్ కనుగొన్నందుకు గర్వంగా ఉందన్నాడు. తన 48వ పెండ్లి రోజు సెలబ్రేషన్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు. బ్రిటన్ ప్రభుత్వం ఇదివరకే ఫైజర్ వ్యాక్సిన్ కు ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఆస్ట్రాజెనెకా డెవలప్ చేసిన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ కు కూడా ఓకే చెప్పింది. ఫైజర్ వ్యాక్సిన్ తో పోలిస్తే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ రవాణా, నిల్వ ఈజీ కానుంది. నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్ హెచ్ఎస్) ఆధ్వర్యంలో బ్రిటన్ లో దశలవారీగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేపట్టారు.
కరోనాను ఓడిస్తం: బ్రిటన్ ప్రధాని
‘ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ బ్రిటిష్ సైన్స్ కు దక్కిన విజయం. వ్యాక్సిన్ డెవలప్ మెంట్, ప్రొడక్షన్ లో పాల్గొన్న అందరికీ థ్యాంక్స్. రాబోయే వారాలు, నెలల్లో మన మందు ఇంకా సవాళ్లు రానున్నాయి. అయితే ఈ ఏడాది మనం కరోనాను ఓడిస్తామన్న నమ్మకం ఉంది’ అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ డైరెక్టర్, ఆక్స్ ఫర్డ్ వర్సిటీ వ్యాక్సిన్ ట్రయల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ప్రొఫెసర్ పొలార్డ్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు అద్భుతమైన, గర్వకారణమైన క్షణం. బ్రిటన్ తోపాటు ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ టీమ్లు హార్డ్ వర్క్ చేశాయి. హెల్త్ కేర్ వర్కర్స్ ఇతర ప్రయారిటీ గ్రూప్స్ కు త్వరలో వ్యాక్సిన్ అందిస్తాం’ అని చెప్పారు.’ఇది పెద్ద అచీవ్ మెంట్. చరిత్రలో నిలిచిపోయే రోజు. బ్రిటన్ లో లక్షలాది వ్యాక్సిన్లను తరలించేందుకు నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రణాళిక తయారు చేసింది. కొత్త వేరియెంట్ కరోనా వైరస్ వచ్చినందున అందరూ కరోనా రూల్స్ తప్పకుండా పాటించాలి. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. భౌతిక దూరం పాటించాలి’ అని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ మట్ హంకాక్ అన్నారు. చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేపట్టామని, ఇప్పటికే 10 లక్షలకుపైగా వ్యాక్సిన్లను డెలివరీ చేశామని ఎన్ హెచ్ ఎస్ మెడికల్ డైరెక్టర్ ప్రొఫెసర్ స్టీఫెన్ పోవిస్ చెప్పారు.
