Ugadi Food Special : ఉగాది స్పెషల్ రెసిపీస్ ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా ఇలా చేసుకోండి

తెలుగువాళ్లంతా ఈ ఉగాది పండుగ కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తారు. ఈ రోజుతో తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి.. ఇదే తెలుగు వారి తొలి పండుగ. షడ్రుచుల (తీపి, కారం, ఉప్పు, వగరు, చేదు, పులుపు)తో తయారు చేసే పచ్చడి ఉగాది స్పెషల్, ఒక్క పచ్చడితో పండుగ పూర్తవ్వదు కదా. అందుకే ఈ పండుగ రోజు సంప్రదాయాన్ని పాటిస్తూ.. కొత్తదనంతో వంటలు చేసి వడ్డిస్తే.. పిల్లలతో పాటు ఇంటిల్లిపాదీ ఎంతో, ఆనందంగా, లొట్టలేసుకుంటూ తింటారు. మరి అలాంటి కొత్త వంటలను చేసేద్దామా...

మామిడి పులిహోర

కావాల్సినవి:
అన్నం మూడు కప్పులు, పుల్లటి మామిడికాయ ఒకటి, శనగపప్పు ఒక టీ స్పూన్, పల్లీలు పావు కప్పు, జీడిపప్పు పలుకులు పది, మినప్పప్పు ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి నాలుగు, ఎండుమిర్చి ఐదు, కరివేపాకు రెండు రెమ్మలు, ఉప్పు తగినంత, నూనె సరిపడా, జీలకర్ర అర స్పూన్, అరటీస్పూన్, పసుపు పావు టీస్పూన్, ఇంగువ కొద్దిగా, నువ్వులు రెండు టీ మెంతులు అరటీస్పూన్, ధనియాలు

తయారీ:
ఒక వెడల్పాటి పళ్లెంలో అన్నాన్ని ఆరబెట్టాలి. మరోవైపు మామిడికాయ చెక్కు తీసి సన్నగా తురిమి అన్నంలో కలపాలి. అలాగే పచ్చిమిర్చిని పొడవుగా చీల్చాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, నువ్వులను విడివిడిగా వేగించి పొడి కొట్టుకోవాలి. స్టవ్ పై పాన్పెట్టి నూనె వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు. నువ్వుల పొడి వేసి పోపు పెట్టాలి. దాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోరని పండుగ రోజు టేస్ట్ చేయాల్సిందే.

మామిడి– కొబ్బరి పచ్చడి

కావాల్సినవి:
మామిడికాయ ఒకటి, పచ్చి కొబ్బరి తరుగు ఒక కప్పు, మినప్పప్పు ఒక టీ స్పూన్, ఎండుమిర్చి పది, ఆవాలు, మెంతులు, జీలకర్ర అరటీస్పూన్ చొప్పున, నూనె సరిపడా ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ కొద్దిగా, కరివేపాకు రెండు రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు నాలుగు 

తయారీ:
మామిడికాయ చెక్కుతీసి చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. పాన్లో మెంతులు, ఎండుమిర్చి, మినప్పప్పులను విడివిడిగా వేగించాలి. అవి చల్లారాక మిక్సీలో అన్నింటినీ కలిపి గ్రైండ్ చేయాలి. మిశ్రమం మెదిగాక పచ్చికొబ్బరి తరుగు, మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి. తర్వాత పాన్లో నూనె వేడి చేసి పోపు పెట్టాలి. అందులోనే వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పసుపు, ఇంగువ వేయాలి. అన్నీ వేగాక మిక్సీ పట్టిన పచ్చడిని వేసి దింపేయాలి. పండుగ రోజు వేడివేడి అన్నంలో ఈ పుల్లటి పచ్చడి తినడం ఆనవాయితీగా వస్తోంది. 

సగ్గుబియ్యం దద్దోజనం

కావాల్సినవి:
సగ్గుబియ్యం ఒక కప్పు, పెరుగు రెండు కప్పులు, పాలు పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు ఒక టీ స్పూన్, అల్లం తరుగు అర టీ స్పూన్, శనగపప్పు అర టేబుల్ స్పూన్, మినప్పప్పు అర టేబుల్ స్పూన్, ఆవాలు పావు టీ స్పూన్, జీలకర్ర అర టీస్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, జీడిపప్పు పది, నూనె లేదా నెయ్యి సరిపడా, కొత్తిమీర తరుగు అరటేబుల్ స్పూన్, పుదీనా తరుగు ఒక టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత

తయారీ: 
నాలుగు గంటలపాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టాలి. మరోవైపు స్టప్పై పాన్లో నూనె లేదా నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి. ఆపైన నానబెట్టిన సగ్గుబియ్యం వేయాలి. అవి బాగా మగ్గాడ దింపేయాలి. మరోవైపు వెడల్పాటి గిన్నెలో పెరుగు, అల్లం తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో చల్లారిన సగ్గుబియ్యం మిశ్రమం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేయాలి.. కావాలనుకుంటే బూందీ వేసుకోవచ్చు. అంతే, దద్ధోజనం రెడీ.