Ugadi Food Special :ఉగాది రోజు ఈ పిండి వంటలు కచ్చితంగా ఉండాలా.. దేవుడికి ప్రీతి.. ఆరోగ్యానికి మంచిది

తెలుగు వారి పండుగ ఉగాది. చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఉగాది జరుపుకుంటారు. ఉగాదిని అందరూ ఒకేలా జరుపుకుంటారు. చిన్న చిన్న తేడాలుంటాయంతే.. తప్పా మిగితాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఉగాది పండగ రోజు మనం చేసుకునే పిండి వంటల గురించి తెలుసుకుందాం.

ఉగాదికి ఈ పిండి వంటలు చేసుకోవడం సంప్రదాయబద్ధంగా వస్తోంది. చేసుకున్న వంటకాలన్ని పండగ రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టి ఈ కొత్త సంవత్సరంలో అన్ని సవ్యంగా జరగాలని కోరుకుంటుంటారు. ఉగది స్పెషల్ పిండి వంటలు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్ణం బూరెలు

కావాల్సినవి: 
శెనగపప్పు ఒక కప్పు, బెల్లం తురుము ఒక కప్పు, ఇలాచీ పొడి అర టీ స్పూన్, నెయ్యి సరిపడా, మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్, బియ్యం రెండు టేబుల్ స్పూను, ఉప్పు
చిటికెడు, నూనె సరిపడా

తయారీ:

మినప్పప్పును రెండు గంటలు పాటు నానబెట్టి రుబ్బాలి. దాన్ని తడిపిన బియ్యప్పిండిలో వేసి, తగినంత ఉప్పు కలిపి గంటసేపు నానబెట్టాలి. మరోవైపు శెనగపప్పును ఉడికించాలి. నీళ్లు వడగట్టి, ఆ పప్పులో బెల్లం తురుము వేసి రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యిలో వేగించి చల్లారాక చిన్నచిన్న ఉండలుగా చేయాలి. వీటిని పిండిలో ముంచి, మరుగుతున్న నూనెలో దోరగా వేగించాలి. చాలా ప్రాంతాల్లో పూర్ణం బూరెలను ఉగాది స్పెషల్ గా చేసుకుంటారు.

డ్రై ఫ్రూట్స్ భక్ష్యాలు

కావాల్సినవి:
మైదాపిండి లేదా గోధుమపిండి రెండు కప్పులు, నెయ్యి సరిపడా, ఉప్పు చిటికెడు, జీడిపప్పు పొడి అరకప్పు, బాదంపప్పు పొడి అరకప్పు, అంజీర్ పేర్లు అరకప్పు, ఎండుకొబ్బరి తురుము అరకప్పు, ఇలాచీ పొడి పావు టీ స్పూన్, బెల్లం తురుము అరకప్పు

తయారీ:
ఒక గిన్నెలో మైదా లేదా గోధుమపిండి, ఉప్పు, ఒక టీ స్పూన్ నెయ్యి, సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. మరో గిన్నెలో జీడిపప్పు పొడి, బాదంపప్పు పొడి, అంజీర్ పీస్. ఎండుకొబ్బరి తురుము, ఇలాచీ పొడి వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేయాలి. తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పూరీల్లా వత్తాలి. వాటి మధ్యలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం పెట్టి, మళ్లీ ఉండలుగా చేయాలి. వీటిని చేతితో లేదా చపాతీ కర్రతో వత్తాలి. పెనంపై వాటిని నూనె లేదా నెయ్యితో రెండువైపులా కాల్చాలి. ఈ డ్రై ఫ్రూట్స్ భక్ష్యాలను నెయ్యితో నంజుకుంటే రుచిగా ఉంటాయి.