అపర భగీరథుడు కోమటిరెడ్డి

  •  ఉదయసముద్రం రిజర్వాయర్  ప్రారంభోత్సవం  సందర్భంగా...
  •  విశ్వనాధుల పుష్పగిరి విశ్లేషణ

అపర భగీరథుడు,  తెలంగాణ ఉద్యమ పోరు కెరటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానస పుత్రిక బ్రాహ్మణ వెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్ట్.  2007 ఆగస్టులో  దాదాపు రూ. 700 కోట్ల అంచనా వ్యయంతో ఆనాటి  సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి  చేతులమీదుగా బ్రాహ్మణ వెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. 

17 సంవత్సరాల పురిటినొప్పుల తర్వాత రిజర్వాయర్  నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోనుంది.  ఫ్లోరైడ్  పీడిత  నల్లగొండ జిల్లాలోని  నార్కట్​పల్లి,  చిట్యాల, మునుగోడు, రామన్నపేట, శాలిగౌరారం, కట్టంగూర్  తదితర  మండలాలకు చెందిన దాదాపు నాలుగు వందల  గ్రామాలకు  తాగునీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్  రూపకల్పన జరిగింది. 

నెరవేరనున్న కోమటిరెడ్డి ప్రతిజ్ఞ

కోమటిరెడ్డి వెంకటరెడ్డి  రైతుకుటుంబం నుంచి వచ్చినవాడు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం తల్లడిల్లిపోయిన తండ్రి పాపిరెడ్డి,  తల్లి సుశీలమ్మ చెప్పిన కన్నీటిగాథల్ని తనలో దాచుకున్నాడు. అపారమైన జలసిరితో  కళకళలాడిన ఆ ప్రాంతం తన కళ్ళ ముందే బీడుభూమిగా మారడాన్ని చూసి చలించిపోయాడు.  జిల్లాలో నిత్యం అన్నదాతల మృత్యుగోస  పత్రికల్లో  ప్రధాన హెడ్డింగులుగా కనిపించేవి.  

ఫ్లోరైడ్  రక్కసితో ఎముకలు వంగి,  వెన్నుపూసలు ఛిద్రమైన మనుషుల్ని చూసి, ఒక్కో రైతు డజన్ల కొద్దీ బోర్లు వేసి గొంతు తడుపుకునే నీళ్లు కూడా పడక  పొలంలోనే ఉరితాళ్లకు వేలాడిన రైతన్నలను చూసి శాశ్వత పరిష్కారం కోసం తపించాడు.  తన ప్రాణంపోయేలోపు ఉదయసముద్రం నీళ్లతో  ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. 

Also Read : తెలంగాణకు నవోదయం

రాజకీయాలు శాశ్వతం కాదు, తనకు జన్మనిచ్చిన  నేలకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో  వై.ఎస్  రాజశేఖరరెడ్డిని మెప్పించి.   బ్రాహ్మణ వెల్లెంలకు తీసుకువచ్చి ఒక మహోజ్వల ఘట్టానికి పునాది రాయి వేయించాడు.  ఆయన ఉక్కు సంకల్పానికి విధి తోడయ్యింది.  ఒక్కొక్క గండాన్ని దాటుకొని ఇప్పుడు బంజేరు నేలమీద కృష్ణమ్మ పాదం మోపుతోంది. 
 
నేలతల్లి తరఫున సీఎం రేవంత్​కు కృతజ్ఞతలు

 

 

ఎన్నాళ్ళున్నా ఈ అసామి పని, అర్కల పని చేస్తే  పొట్టగంజికి కూడా కష్టమైతున్నదని పెండ్లయిన  కొన్నేండ్లకే తల్లిదండ్రులను, ఆలినొదిలి కమ్మరి పిచ్చయ్య బొంబాయి వొయ్యిండు.  అట్లాగడుస్తున్న ఒకరోజున మరిది నీ మొగడు ఇడిసిపెట్టిపోతే  మేం బువ్వ పెట్టాల్నా అన్నడు.  

రోషంగల్ల బతుకు కదా, అత్త లచ్చువమ్మ బర్రె గడ్డికి వొయ్యి ఇంటికి వచ్చేసరికి వరిగొయ్య కూలికి వొయ్యింది కమ్మరి జంగమ్మ. అప్పటికి ఇంకా చిన్నతనమే. కోడలు పిల్ల కనవడక పోయేసరికి దేవులాడుకుంట బాయి బాయి చెల్కలన్ని తిరిగింది లచ్చువమ్మ సద్ది గట్టుకొని, చెంబు నిండ నీళ్లు వోసుకొని. సీతంబాయి కాడ నడుములోతు నీళ్ళల్ల ఈగుకుట్ట వరికోస్తున్న కోడల్ని గుండెలకద్దుకొని దమ్ముధీర ఏడ్చి ఈ కూలొద్దు ఏమొద్దు అని ఇంటికి తోలుకొచ్చింది. 

 ఇది యాభై ఏండ్ల కింది కథ.  ఈ సందర్భం ఎందుకు  చెప్పాల్సివచ్చిందంటే  బ్రాహ్మణ వెల్లెంల మాత్రమే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అపారమైన భూగర్భ జలాలతో వర్ధిల్లేవి.  ఆ దశ నుంచి కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు లేని కాలాన్ని దగ్గరి నుంచి చూశాడు కనుకే ఈ నేల రుణం తీర్చుకోవాలనుకున్నాడు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ మానిటరింగ్ సెంటర్ నివేదిక ప్రకారం ఒక్క నల్లగొండ జిల్లాలోనే  దాదాపు 19 లక్షల మంది  ఫ్లోరైడ్ బారినపడి ప్రమాదంలో ఉన్నారు.  

మూసీ కాలుష్య నీటితో ఎక్కువగా ప్రభావితమయ్యేది నల్లగొండ జిల్లా భూగర్భజలాలే.  అందుకే బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు తన చిరకాల స్వప్నం అని, తాను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఎంపీగా ఉన్నా ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆ స్వప్నం సాకారమయ్యింది. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి.  ఈ ప్రాజెక్టుకు బీజం వేసిన నాటినుంచి ఇందులో భాగమైన  ప్రతి ఒక్కరికి, ప్రభుత్వం ఏర్పడగానే పెండింగ్ పనులకు తగిన తోడ్పాటునందించిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ నీటితో సస్యశ్యామలమయ్యే నేలతల్లి తరఫున కృతజ్ఞతలు. 

- విశ్వనాధుల పుష్పగిరి-