బటర్​ ఫ్లై సిటీ వెంచర్​ విల్లాలో ఇద్దరు యువకుల హత్య

  • రంగారెడ్డి జిల్లా కడ్తాల్​లో ఘటన

ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా కడ్తాల్  మండల కేంద్రం సమీపంలోని బటర్ ఫ్లై సిటీ వెంచర్​లోని ఓ విల్లాలో బుధవారం రాత్రి గోవిందాయపల్లికి చెందిన గుండమోని శివ ( 25) శేషగారి శివ(27) హత్యకు గురయ్యారు. శివ హైదరాబాద్ హైటెక్ సిటీలో చికెన్ సెంటర్ లో పని చేస్తుండగా, శివ హైదరాబాద్​లో డ్రైవర్. మంగళవారం రాత్రి బటర్​ ఫ్లై సిటీ  వెంచర్​లోని ఓ విల్లాలో గోవిందాయపల్లికే చెందిన వ్యక్తి బర్త్​డే సెలబ్రేషన్స్​ జరగ్గా గుండమోని శివ, శేషగారి శివ అటెండ్ ​అయ్యారు. బుధవారం ఉదయం తిరిగి హైదరాబాద్​ వెళ్లిపోయారు.

కానీ, బుధవారం రాత్రి అనూహ్యంగా విల్లాలోని మీటింగ్​ హాల్​లో ఒకరు, బెడ్​రూంలో మరొకరు శవాలై కనిపించారు. దీన్ని మొదట గుండెమోని శివ సోదరుడు గుర్తించాడు. శంషాబాద్ అడిషనల్ ​డీసీపీ రామ్ కుమార్, పోలీసు ఉన్నతాధికారులు, క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు.

తమ గ్రామానికే చెందిన వ్యక్తితో పాటు ఆమనగల్లు మండలం జంగారెడ్డిపల్లికి చెందిన మరో వ్యక్తి ఈ హత్యలు చేశారని మృతుడు గుండెమోని శివ సోదరుడు కరుణాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు హంతకులను కఠినంగా శిక్షించాలని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని.. మృతుల బంధువులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ శివ ప్రసాద్ ​తెలిపారు.