- టూవీలర్ల అమ్మకాలు కూడా డల్
- పెరిగిన త్రీవీలర్ల సేల్స్
న్యూఢిల్లీ: కార్ల రిటైల్అమ్మకాలు గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి మార్చిలో 4.87 శాతం తగ్గి 2,71,358 యూనిట్లకు చేరుకున్నాయని ఆటోమొబైల్ డీలర్ల సంఘం.. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) తెలిపింది. 2021 మార్చి లో కార్ల అమ్మకాలు 2,85,240 యూనిట్లుగా రికార్డయ్యాయి. కార్లతో పాటు టూవీలర్స్ అమ్మకాలూ నిరాశపర్చాయి. వీటి సేల్స్2021 మార్చిలో 12,06,191 యూనిట్ల నుంచి గత నెలలో 4.02 శాతం తగ్గి 11,57,681 యూనిట్లకు పడిపోయాయి. ‘‘రూరల్ ఎకానమీ ఇప్పటికీ బలహీనంగానే ఉంది. టూవీలర్స్ ధరలు ఎక్కువ అయ్యాయి. పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకే వీటికి డిమాండ్ తక్కువగా ఉంది” అని గులాటీ పేర్కొన్నారు. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు గతేడాది మార్చిలో 67,828 యూనిట్ల నుంచి 14.91 శాతం పెరిగి 77,938 యూనిట్లకు చేరుకున్నాయి. అన్ని కేటగిరీలలోని మొత్తం అమ్మకాలు గత నెలలో 16,66,996 యూనిట్ల నుంచి 2.87 శాతం తగ్గి 16,19,181 యూనిట్లకు పడిపోయాయి.అయితే టూవీలర్, కార్లు, ట్రాక్టర్ల అమ్మకాలు వరుసగా 4 శాతం, 5 శాతం 8 శాతం తగ్గాయి. రూరల్ ఎకానమీ బలహీనంగా ఉన్న కారణంగా ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న టూవీలర్ సెగ్మెంట్ పెట్రోల్ ధరలతో పాటు వెహికల్స్ ఓనర్షిప్ ధరల పెరుగుదల కారణంగా మరింత మందగించింది. అమ్మకాలను పెంచడానికి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలని అన్ని టూవీలర్ ఓఈఎంలకు ఫాడా సూచించింది. ఇదిలా ఉంటే.. ‘‘గత నెలలో సరఫరాలు కొద్దిగా మెరుగుపడ్డాయి. కార్ల సప్లై సరిపడినంతగా లేదు. డెలివరీల కోసం కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. సెమీకండక్టర్ కొరత ఇప్పటికీ ఉన్నది. ప్రొడక్షన్, అమ్మకాల తగ్గుదలకు ఇదొక కారణం’’ అని ఫాడా ప్రెసిడెంట్ వింకేష్ గులాటి పేర్కొన్నారు. రష్యా-–ఉక్రెయిన్ యుద్ధం, చైనా లాక్‌డౌన్ విధించడం సరఫరాలను మరింత దెబ్బతీస్తున్నదని తెలిపారు. జనం కార్లను కొనడం తగ్గించారని, కరోనా ఎఫెక్ట్, రేట్ల పెరుగుదల వంటివి ఇందుకు కారణమని ఫాడా వర్గాలు తెలిపాయి.
45 శాతానికి పెరిగిన ఈవీ త్రీవీలర్ల వాటా
త్రీవీలర్ అమ్మకాలు 2021 మార్చి లో 38,135 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 26.61 శాతం పెరిగి 48,284 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం త్రీవీలర్ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వేరియంట్ల వాటా 45 శాతానికి పెరిగింది. గత నెల 21,727 ఈ–త్రీవీలర్లు అమ్ముడయ్యాయి. వీటి అమ్మకాలు ఇంత భారీగా రికార్డు కావడం ఇదే మొదటిసారి. కిందటి ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,29,217 ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడయ్యాయి. వీటిలో ఈ–త్రీవీలర్ల సంఖ్య 1,77,874గా రికార్డయింది. అంకుముందు ఆర్థిక సంవత్సరంలో 88,391 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 4,984 యూనిట్ల నుంచి 17,802 యూనిట్లకు పెరిగాయి. విద్యాసంస్థలు తెరుచుకోవడం, కరోనా రిస్ట్రిక్సన్లను ఎత్తివేయడం, మార్కెట్లు పూర్తిస్థాయిలో పనిచేయడంతో త్రీవీలర్లకు డిమాండ్ పెరిగిందని ఫాడా తెలిపింది.
కార్లకు మోస్తరు డిమాండ్
కార్లకు రాబోయే కొన్ని క్వార్టర్లలో మోస్తరు డిమాండ్ ఉండొచ్చని అక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తెలిపింది. ఎకానమీ పూర్తిస్థాయిలో పనిచేయడం, డిమాండ్ సాధారణ స్థాయికి చేరడం, గ్రామాల నుంచి కొనుగోళ్లు బాగుండటం ఇందుకు కారణమని పేర్కొంది. సెమీకండక్టర్ల కొరత ఇప్పటికీ తీరలేదు కాబట్టి డిమాండ్‌కు తగినంత సప్లై ఉండకపోవచ్చని పేర్కొంది. సప్లై సమస్యలు ఉన్నప్పటికీ కిందటి ఫైనాన్షియల్ ఇయర్లో కార్ల అమ్మకాలు 14.7 శాతం పెరిగాయి. విడిభాగాలు దొరక్కపోవడంతో కంపెనీలు కొన్ని రోజులు ప్రొడక్షన్‌ను ఆపేశాయి. చిన్న వ్యాపారాలు, అసంఘటిత రంగం.. ఇప్పటికీ కరోనా కష్టాల నుంచి పూర్తిగా కోలుకోకపోవడం వల్ల టూవీలర్ మార్కెట్ గత ఫైనాన్షియల్ ఇయర్లో డల్‌గా ఉందని అక్యూట్ పేర్కొంది. కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో టూవీలర్లకు గిరాకీ పెరగొచ్చని అంచనా వేసింది. కమర్షియల్ వెహికల్స్‌కు కూడా డిమాండ్ కొనసాగుతుందని వివరించింది.
