- 32 మందికి గాయాలు
- సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న రైలును ఢీకొట్టిన మరో రైలు
- పట్టాలు తప్పిన మూడు బోగీలు
- విద్యుత్ వైర్లు తెగడంతో సహాయక చర్యలకు ఆటంకం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో ఘోరం జరిగింది. రెండు రైళ్లు ఢీకొని 8 మంది చనిపోగా, 32 మంది గాయపడ్డారు. నలుగురు పరిస్థితి విషమం గా ఉంది.గాయపడ్డవారికి విజయనగరం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.విశాఖ నుంచి పలాసకు వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు ఆదివారం రాత్రి 7:30 గంటల టైమ్ లో కొత్తవలస మండలం అలమండ–కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం పట్టాలపై ఆగి ఉంది. అదే టైమ్ లో వెనుక నుంచి వస్తున్న విశాఖ–రాయగడ రైలు.. ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలంలో భీతావహ పరిస్థితి నెలకొంది. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్ స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.గాయపడినోళ్లను విజయనగరం, విశాఖపట్నం ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశంఉందన్నారు.
తెగిపోయిన విద్యుత్ వైర్లు..
రెండు రైళ్లు ఢీకొనడంతో, అక్కడ విద్యుత్ వైర్లు కూడా తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతమంతా చీకటి నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్యాసింజర్ రైలు కావడంతో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారిందని అధికారులు చెప్పారు. విజయనగరం కలెక్టర్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కోల్ కతా–చెన్నై మెయిన్ రూట్ లో ఈ ప్రమాదం జరగడంతో భువనేశ్వర్ వద్ద కొన్ని రైళ్లను నిలిపివేశారు.
కోల్ కతా వైపు వెళ్లే రైళ్లను విశాఖపట్నం తదితర స్టేషన్లలో ఆపారు. కాగా, రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దగ్గర్లోని జిల్లాల నుంచి వీలైనన్ని అంబులెన్స్ లు పంపించాలని, లోకల్ ఆస్పత్రుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.